బ్రిటన్‌లాంటి దేశాల్లో సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. అసలు గర్భిణులకు ఈ వ్యాక్సిన్ ఇస్తారా? ఇవ్వరా అనేదానిపై ఇంత వరకూ స్పష్టత లేదు. ఇప్పటి వరకూ వ్యాక్సిన్‌లు తయారు చేసిన కంపెనీలు తమ క్లినికల్ ట్రయల్స్‌లో గర్భిణుల పైగానీ, బాలింతలపైగానీ ప్రయోగాలు చేయలేదు. దీంతో వ్యాక్సిన్ వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనడానికి సంబంధించి ఎలాంటి డేటా అందుబాటులో లేదు. ప్రస్తుతానికి అమెరికా, బ్రిటన్ ఈ విషయంలో పరస్పరం విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. బ్రిటన్‌లో వ్యాక్సినేషన్ నుంచి గర్భిణులు , బాలింతలను తప్పించగా.. అమెరికాలో మాత్రం నిర్ణయాన్ని వారికే వదిలేశారు. నిజానికి ఇప్పటి వరకూ దీనికి సంబంధించి ఎలాంటి డేటా అందుబాటులో లేదు అని జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీలోని బయోఎథిసిస్ట్ డాక్టర్ రూథ్ ఫేడెన్ అన్నారు. అలాగని ఈ వ్యాక్సిన్ గర్భిణులు , బాలింతలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు. అమెరికాలో గర్భిణులను క్లినికల్ ట్రయల్స్‌లో భాగం చేయకూడదన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకున్నట్లు ఫైజర్ సంస్థ తెలిపింది. డార్ట్ స్టడీస్ (డెవలప్‌మెంటల్ అండ్ రీప్రోడక్టివ్ టాక్సిసిటీ) పూర్తి చేసినంత వరకూ గర్భిణులను ట్రయల్స్‌లో భాగం చేయకూడదని ఫైజర్ నిర్ణయించింది. నిజానికి కొత్త వ్యాక్సిన్ ఏదైనా సరే గర్భిణులపై ప్రయోగాలకు దూరంగానే ఉంటారన్నది నిపుణుల మాట. బయోఎథిక్స్‌లో గర్భిణులను సంక్లిష్ట జనాభాగా వర్ణిస్తారని డాక్టర్ ఫేడెన్ తెలిపారు. గర్భిణులపై ఇలాంటి ప్రయోగాలు చేసే ముందు తలెత్తే తొలి ప్రశ్న.. ఇది నా బేబీకి సురక్షితమేనా అన్నదే అని ఫేడెన్ అన్నారు. అలాగని ఇలాంటి క్లిష్ట సమయంలో గర్భిణులను క్లినికల్ ట్రయల్స్ నుంచి తప్పించడం కూడా మంచి నిర్ణయం కాదు.
అయితే గర్భిణుల విషయంలో అమెరికా, బ్రిటన్ ఒక్కోలా వ్యవహరిస్తున్నాయి. రిస్క్ ఎందుకులే అనుకున్న బ్రిటన్..గర్భిణులను వ్యాక్సినేషన్ నుంచి తప్పించింది. అమెరికా మాత్రం ఆ నిర్ణయాన్ని వారికే వదిలేసింది. అయితే అమెరికాలోని కొందరు గర్భిణులు , బాలింతలు మాత్రం తాము ఈ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేమని అంటున్నారు. వ్యాక్సిన్ గర్భిణులపై ప్రతికూల ప్రభావం చూపుతుందనడానికి ఆధారాలు లేకపోయినా.. మరింత క్లినికల్ డేటా వచ్చిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతానికి ఈ రెండు దేశాలతోపాటు ఇతర ప్రపంచ దేశాల్లోని గర్భిణులు , బాలింతలు వ్యాక్సిన్ కోసం మరి కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. మరిన్ని క్లినికల్ ట్రయల్స్ జరిగి స్పష్టమైన డేటా అందుబాటులోకి వచ్చే వరకూ ప్రభుత్వాలు దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు లేవు. ఫైజర్ సంస్థ డార్ట్ స్టడీస్‌కు సంబంధించి ప్రాథమిక ఫలితాలు ఈ ఏడాది చివరి లోపు రానున్నాయి. ఈ అధ్యయనం పూర్తయిన తర్వాత క్లినికల్ ట్రయల్స్‌లో గర్భిణులను కూడా భాగం చేయాలని ఫైజర్ భావిస్తోంది. ఇప్పటికే ట్రయల్స్‌లో భాగమై మధ్యలో గర్భం దాల్చిన మహిళలను ప్రత్యేకంగా మానిటర్ చేస్తోంది. అయితే కొవిడ్ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో సమర్థవంతమైనదని తేలాలంటే గర్భిణులపైనా ప్రయోగాలు జరగాల్సిందేనని డాక్టర్ ఫేడెన్ స్పష్టం చేస్తున్నారు.