డిసెంబరు 25 నుంచి జనవరి 3 వ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లు 24వ తేదీ నుంచి తిరుపతిలో స్థానికులకు మాత్రమే జారీ చేస్తామని టీటీడీ ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. బయటి ప్రాంతాల భక్తులు ఈ విషయం గమనించాలని ఆయన కోరారు.
వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి స్థానికులకు మాత్రమే 10 రోజుల పాటు సర్వ దర్శనం టికెట్లు జారీ చేయడానికి ఏర్పాటు చేసిన కౌంటర్లను మంగళవారం ఆయన పరిశీలించారు. రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం, ఎం ఆర్ పల్లి మార్కెట్, బైరాగి పట్టెడ రామానాయుడు మున్సీపల్ హై స్కూల్, మున్సిపల్ ఆఫీసు లోని ఈ కౌంటర్ల వద్ద క్యూ లైన్లు, ఇతర ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ కేంద్రాల్లో రోజుకు 10 వేల చొప్పున 10 రోజులకు లక్ష సర్వ దర్శనం టికెట్లు జారీ చేస్తామన్నారు. రోజుకు 20 వేల చొప్పున 10 రోజులకు 2 లక్షల టికెట్లు ఇప్పటికే ఆన్లైన్ లో జారీ చేసినట్లు ఈఓ తెలిపారు. టికెట్ ఉన్న భక్తులను మాత్రమే అలిపిరి, శ్రీ వారి మెట్టు నడకదారులు, అలిపిరి రోడ్డు మార్గంలో అనుమతిస్తామన్నారు. భక్తులు టికెట్ లేకుండా వచ్చి ఇబ్బంది పడవద్దని ఆయన కోరారు. ఇప్పటికే యూకే లో కొత్త వైరస్ వ్యాపిస్తున్నందు వల్ల కేంద్ర ప్రభుత్వం భారత్ నుంచి ఆ దేశానికి విమానాల రాక పోకలు నిలిపి వేసిందన్నారు. భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించి, టికెట్ లేని వారు జనవరి 4 వ తేదీ తర్వాత ఆన్లైన్లో దర్శనం టికెట్లు పొందే ప్రయత్నం చేసుకోవాలని ఈఓ సూచించారు.