విజయవాడ, డిసెంబర్ 23,
రాజకీయాలే కాదు.. స్నేహాలు కూడా అవసరానికి తగిన విధంగా మారిపోతూ ఉంటాయి. ఎక్కడ ఎప్పటికి ఎలాంటి అవసరం ఉంటుందో.. అప్పటికి అలా వ్యవహరించడం రాజకీయ నేతల లక్షణం. వాస్తవానికి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఇప్పుడు స్నేహాల్లోనూ ఇలాంటి వ్యవహారమే తెరమీదికి వచ్చింది. జనసేనాని పవన్ కళ్యాణ్.. పార్టీ ప్రారంభం నుంచి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లింగమనేని ఎస్టేట్స్ అధినేత లింగమనేని రమేష్‌తో స్నేహంగా ముందుకు సాగారు. పార్టీకి అవసరమైన నిధుల సేకరణ, పార్టీ కార్యాలయం ఏర్పాటు.. మౌలిక సదుపాయాలు.. అతిథులు ఎవరైనా వస్తే.. చూసుకునే బాధ్యతలను సంపూర్ణంగా లింగమనేని అధినేత చూసుకున్నారు.ఆఖరుకు మీడియా సమావేశాలు నిర్వహించినా.. పార్టీ తరఫున ప్రచారం చేసుకున్నా.. లింగమేనని నుంచి నిధులు అందాయనేది వాస్తవం. దీనివెనుక లింగమనేని రమేష్ ఆశించిన ప్రయోజనం ఏముందో తెలియదు కానీ.. గత ఏడాది ఎన్నికల వరకు కూడా ఈ బంధం కొనసాగింది. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేనాని గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. దీంతో లింగమేనని రమేష్ కూడా ఖర్చులు తగ్గించుకుంటూ వచ్చారు. అందుకే మీడియా సమావేశాలు నిర్వహించినా మొక్కుబడిగానే వ్యవహరిస్తున్నారు. గతంలో మాదిరిగా అట్టహాసంగా ఎలాంటి ఏర్పాట్లూ చేయడం లేదు. ఇదిలావుంటే.. ఇప్పుడు ప్రముఖ ఇంజనీరింగ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ మేఘా అధినేత కృష్ణారెడ్డితో జనసేనాని పవన్ కల్యాణ్ స్నేహం మొదలైందని అంటున్నారు.తాజాగా కృష్ణా జిల్లాలోని డోకిపర్రులో కృష్ణారెడ్డి నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పవన్ కల్యాణ్ కనిపించారు. అది కూడా వ్యక్తిగత పర్యటనేమీ కాదు.. పక్కన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. డోకిపర్రులో కృష్ణారెడ్డి స్వయంగా తన నిధులతో వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. దీనిని దర్శించుకునేందుకు పవన్ కల్యాణ్ వెళ్లడం రాజకీయంగా ఆసక్తిని రేపింది. ఇక్కడ జరుగుతోన్న బ్రహ్మోత్సవాలకు వచ్చిన పవన్‌కు కృష్ణారెడ్డి ఫ్యామిలీ ఎంతో సాదారంగా స్వాగతం పలికింది.వాస్తవానికి మేఘా కంపెనీ రాష్ట్రంలో పోలవరం (ప్రాజెక్టులో కొంత భాగం) పనులు చేపట్టింది. దీనిలో అవినీతి జరిగిందని గతంలో పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇక, ఇప్పుడు కూడా పోలవరంపై ఆయన అసంతృప్తితోనే ఉన్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ అనూహ్యంగా ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అధినేత ఆతిథ్యాన్ని స్వీకరించడం, ఆయన నిర్మించిన దేవాలయాన్ని దర్శించడం వంటివి ఖచ్చితంగా రాజకీయంలో భాగమేనని అంటున్నారు. అంటే.. ప్రత్యక్ష రాజకీయం కన్నా.. పరోక్ష రాజకీయం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు పరిశీలకులు. పార్టీకి ఫండ్ రూపంలోనో.. మరో ఇతరత్రా రూపంలో మేఘా కృష్ణారెడ్డి సాయం చేసే అవకాశం ఉందని. ఇప్పుడున్న పరిస్థితి తనకు కూడా అవసరం కనుక, పవన్ కల్యాణ్ లింగమనేనిని పక్కన పెట్టి.. మేఘాతో జతకట్టారని అంటున్నారు రాజకీయ పండితులు. మరి దీనిపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.