విజయవాడ, డిసెంబర్ 23,
టీడీపీని పుంజుకునేలా చేయాలని పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా ఎక్క డో బెడిసి కొడుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో పార్టీ పార్లమెంటరీ పదవులు ఇచ్చారు. అదే సమయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వంలోనూ కొత్త వారిని నియమించారు. పార్టీ పొలిట్ బ్యూరోలోనూ కొత్తవారికి అవకాశం ఇచ్చారు. కానీ, వారంతా ఎక్కడా బయటకు రాకపోవడం గమనార్హం. పార్టీలో పాత నేతలే పలు కార్యక్రమాలకు హాజరు అవుతున్నారని.. కొత్తవారు బయటకు రావడం లేదని చెబుతున్నారు. దీంతో పార్టీ పుంజుకుంటుందా ? లేదా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఇక, పాత నేతల్లోనూ చాలా మంది బయటకు రావడం లేదు. వచ్చినా ఫొటోలు, మీడియా బైట్‌లకు ప్రాధాన్యం ఇచ్చి తమ ఇళ్లకు వెళ్లిపోతున్నారు. గతంలో మీడియా చర్చల్లో మంత్రులు, సీనియర్ నేతలు ఎక్కువుగా పాల్గొని బలంగా వాయిస్ వినిపించేవారు. ఇప్పుడు పట్టాభి, గన్ని ఆంజనేయులు లాంటి కొందరు నేతలు మాత్రమే మీడియా చర్చల్లో ఎక్కువుగా కనిపిస్తున్నారు. ఇక పార్టీ పుంజుకునే పరిస్థితి వస్తోందని భావిస్తున్నప్పుడల్లా అసెంబ్లీ జరుగుతోంది. అదేం ఖర్మో తెలియదుకానీ.. అధికార పార్టీ దూకుడుతో చంద్రబాబు టార్గెట్ అవుతున్నారు. ఫలితంగా పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించినా కార్యకర్తలు డుమ్మా కొడుతున్నారు. ఇక, కొందరు తమకు పదవులు ఇవ్వలేదని.. మరికొందరు తమకు ఉన్న పదవులు తీసేసి ప్రాధాన్యం లేని పదవులు ఇచ్చారని.. ఇలా అలిగి పార్టీకి దూరంగా ఉంటున్నారు.మొత్తంగా చూస్తే పార్టీలో అన్ని జిల్లాలలోనూ శూన్యత కనిపిస్తోంది. మొన్న పదవులు వచ్చిన కొత్త వారిలో ఎవ్వరూ జనాల్లో పట్టున్న నేతలు కారు. కొత్త నేతలకు, యువతకు పదవులు ఇవ్వాలనుకుంటే దూకుడుగాను, పార్టీ తరపున బలంగా కౌంటర్లు ఇచ్చే వారికి పదవులు ఇవ్వాలే కాని పేరుకు చివర పదవులను అలంకరించుకునే వారికి ఎందుకన్న విమర్శలు, అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ఇక పేరుకు 25 మందికి పార్లమెంటరీ పార్టీ పగ్గాలు ఇచ్చినా వీరిలో గుంటూరులో బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం, ఏలూరులో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం, శ్రీకాకుళం, నరసారావుపేట ఇలా ఓ ఏడెనిమిది పార్లమెంటరీ స్థానాల్లో మాత్రమే పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయే తప్ప మిగిలిన వారు పేరుకు చివర బోర్డులు పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నారు.చంద్రబాబు దూరదృష్టితో కొత్తవారికి అవకాశం ఇచ్చినా.. వారిలో చాలా మంది అసమర్థులు కావడం, పార్టీ కోసం ముందుకు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా పార్టీ కష్టాల్లో ఉన్న వేళ పదవులు వచ్చిన వారు కూడా ఉపయోగించు కోలేక పోతుండడంతో చంద్రబాబు వ్యూహం అంతగా సక్సెస్ కాలేదనే చెప్పాలి.