YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రచారం సరే..ఆచరణ ఎక్కడ

ప్రచారం సరే..ఆచరణ ఎక్కడ

విజయనగరం, డిసెంబర్ 23, 
విజయనగరం జిల్లాలో జగనన్నతోడు పథకం ప్రచారం కోటలు దాటుతున్నా లక్ష్యం మాత్రం గడపదాటడం లేదు. ప్రభుత్వ ఇస్తామన్న రూ.10వేల రుణం కోసం కళ్లు కాయలు కాసేటట్టు చూస్తున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రారంభించి 25రోజులు కావస్తున్నా నేటికీ లక్ష్యం ఆమడదూరంలోనే ఉంది. పనంతా గ్రామ సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్లపై వదిలేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని సంక్షేమ శాఖల అధికారులు చెబుతుండగా, అబ్బబ్బే అంతా తామే చూసుకుంటున్నామని డిఆర్‌డిఎ అధికారులు చెప్తున్నారు. కారణం ఏదైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జగనన్నతోడు లబ్ధిదారులకు అందని ద్రాక్షలా ఉంది.చిరువ్యాపారులను ప్రోత్సాహిస్తూ గత నెల 25న జగనన్న తోడు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన విషయం విధితమే. ఈ పథకం కింది లబ్ధిదారులకు రూ.10వేల బ్యాంకు రుణం ఇవ్వనున్నారు. దీనిపై వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ విషయమై తగిన ప్రచారం లేకపోవడంతో మిగిలిన పథకాల మాదిరిగా సబ్సిడీ ఉంటుందని భావించిన చిరువ్యాపారులు ఇబ్బుడిముబ్బుడిగా దరఖాస్తులు చేసుకున్నారు. కాలం గడుస్తున్నా రుణాలు మంజూరు కాకపోవడం, పైగా ప్రభుత్వ సబ్సిడీ లేదని ఇప్పుడిప్పుడే తెలుస్తుండడంతో చాలా మంది తమ దరఖాస్తులను ఉపసంహరించుకున్నారు. చివరకు జిల్లా వ్యాప్తంగా 25,995 దరఖాస్తులు మాత్రమే మిగిలాయి. వీరికి రుణాలు ఇప్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఇప్పటికీ వెయ్యి మందికి మించి రుణాలు అందకపోవడమే ఇందుకు నిదర్శనం. జిల్లాలో చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులే ఎక్కువ. ఏటేటా సకాలంలో వర్షాల్లేక ఇతర ప్రాంతాల్లో చిరువ్యాపారాల కోసం వెళ్లినవారు అనేక మంది ఉన్నారు. వారికి ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు ఉండే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వారంతా తమ సొంతూళ్లలోనే దరఖాస్తులు చేసుకున్నారు. కానీ, వారు నివాసం ఉండే ప్రాంతాల్లో బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. పనంతా తామే చూసుకుంటున్నామంటున్న డిఆర్‌డిఎ, వెలుగు సిబ్బంది జగనన్నతోడు దరఖాస్తులను లబ్ధిదారుల స్థిరనివాస ప్రాంతంలోని బ్యాంకులకు కాకుండా సర్వీస్‌ బ్యాంకులకు పంపేసినట్టు సమాచారం. దీంతో తమ వద్ద బ్యాంకు అకౌంట్‌ ఉన్నప్పటికీ దరఖాస్తుదారు చిరునామా స్థానికంగా లేకపోవడం వల్ల తాము ఇవ్వలేమంటూ పెండింగ్‌లో పెడుతున్నారు. ఒకటీ అర బ్యాంకులు ఇలా ముందుకు వచ్చినప్పటికీ బ్యాంకు డాక్యుమెంటేషన్‌పై సచివాలయ సిబ్బందికి పెద్దగా అవగాహన లేదు. అంతా తామే చేస్తున్నామంటున్న వెలుగు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తే ఆదిలోనే బ్యాంకుల్లో ఎదురౌతున్న ఇబ్బందులు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చేవి. ఇలాంటి సమస్యలతో పది రోజుల క్రితం వరకు పడకేసింది. దీంతో, అప్రమత్తమైన జిల్లా కలెక్టర్‌ వారం రోజుల క్రితం ఆఘమేఘాలపై జగనన్న తోడు అమలుకు ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం విధితమే. జెసి, అసిస్టెంట్‌ కలెక్టర్‌, ఐటిడిఎ పిఒ, సబ్‌-కలెక్టర్‌, ఆర్‌డిఒ, డిపిఒ, డిఎల్‌ పిఒ తదితరులను నియోజకవర్గ అధికారులుగా నియమించారు. దీంతో, వారంతా ప్రస్తుతం పథకం అమలుపై దృష్టిసారించినప్పటికీ తొలుత పథకంపై ప్రచారలోపం మొదలుకుని బ్యాంకులు, అధికారుల మధ్య జరిగిన సమన్వయ లోపం నేటికీ ఆటకంగానే ఉంది.

Related Posts