హైదరాబాద్, డిసెంబర్ 23,
విద్యుత్ ఉద్యోగుల విభజన అంశం చివరిదశకు చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జస్టిస్ ధర్మాధికారి ఏకసభ్య కమిషన్ నివేదికను తెలంగాణ విద్యుత్ సంస్థలు అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. సుప్రీం ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి 655 మంది విద్యుత్ ఉద్యోగులు ఇక్కడి విద్యుత్ సంస్థల్లోకి రావల్సి ఉంది. అంతే సంఖ్యలో తెలంగాణ నుంచి ఏపీకి ఇక్కడి ఉద్యోగులు వెళ్లాల్సి ఉంటుంది. ఆరేండ్ల క్రితం స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి 1157 మంది ఉద్యోగులను రిలీవ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రిలీవ్ ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను కోర్టు నియమించడం తెలిసినవే. అయితే ధర్మాధికారి కమిటీ నివేదిక తమకు వ్యతిరేకంగా ఉన్నందున, దాని అమలు నిలిపివేయాలని తెలంగాణ విద్యుత్ సంస్థలు సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లాయి. అయితే దీనిపై సమర్థవంతమైన వాదనలు వినిపించలేకపోవడంతో సుప్రీం ధర్మాసనం తెలంగాణ విద్యుత్ సంస్థల పిటీషన్‌ను కొట్టివేసి, ధర్మాధికారి నివేదిక అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ దశలో తప్పనిసరి పరిస్థితుల్లో తుది జాబితాను తెలంగాణ విద్యుత్ సంస్థలు రూపొందించాయి. అయితే రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవారికి ఈ జాబితాలో మినహాయింపు ఇవ్వాలని రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ఒప్పందానికి వచ్చాయి. అలాగే మెడికల్, స్పౌస్ కేసుల్లో కూడా మినహాయింపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జెన్‌కో నుంచి 252 మంది ఏపీకి, అక్కడి నుంచి అంతే సంఖ్యలో తెలంగాణకు రావల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ ట్రాన్స్‌కో నుంచి 173 మంది, టీఎస్‌ఎస్పీడీసీఎల్ నుంచి 81 మంది, టీఎస్‌ఎన్పీడీసీఎల్ నుంచి 65 మంది ఏపీకి వెళ్తారు. అంతే సంఖ్యలో అక్కడి నుంచి ఉద్యోగులు ఇక్కడకు వస్తారు. అయితే ఈ ఎంపికను తెలంగాణ విద్యుత్ సంస్థల ఇంజినీర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏపీ నుంచి ఉద్యోగులు ఇక్కడకు వస్తే, తమకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. గతంలో కోర్టు ధిక్కరణ ఎదుర్కోవలసి వస్తుందనే భయంతో టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన పదోన్నతుల్ని వాపస్ తీసుకున్నారు. అప్పట్లో ఉద్యోగుల నుంచి ఆ సంస్థ సీఎమ్‌డీ జి రఘుమారెడ్డి తీవ్ర నిరసనను ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందని ఉద్యోగులు భావిస్తున్నారు. అయితే పదోన్నతుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన 2014 జూన్ నాటినే ప్రమాణికంగా తీసుకుంటామని టీఎస్‌జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు తెలిపారు. ఇష్టం లేకున్నా, కోర్టు ఆదేశాలు అమలు చేయక తప్పట్లేదని ఆయన అన్నారు. ఉద్యోగుల తుది జాబితాను ఏపీ విద్యుత్ సంస్థలకు పంపామని ఆయన తెలిపారు. ఏపీ నుంచి వచ్చే ఉద్యోగులను అడ్డుకుంటామని తెలంగాణ విద్యుత్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్య క్షులు ఎన్ శివాజీ తెలిపారు.