విజయవాడ, డిసెంబర్ 23
జగన్ అసలు మంత్రిగా పనిచేయలేదు. ఆయనకు రాజకీయంగా పెద్దగా అనుభవం లేదు. ఆయనకు పాలన ఏం చాతనవుతుంది అన్నది మొదటి నుంచి టీడీపీ సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలు. ఇక ఈ మధ్యనే చంద్రబాబు మాట్లాడుతూ జగన్ కి కనీసం ఫండమెండల్స్ తెలియవు. ముఖ్యమంత్రిగా ఆయన అసమర్ధుడు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు టీడీపీ ఆరోపణలను జనం పెద్ద సీరియస్ గా పట్టించుకునే రోజులు లేవు ఇపుడు. కానీ సాదారణ జనం, తటస్తులు మాత్రం జగన్ ఏదో చేయాలనుకున్నాడు, ఆయనకు ఒక తపన ఉంది అన్నదాన్ని పూర్తిగా అంగీకరిస్తున్నారు.జగన్ తాను సీఎం అయిన నాటి నుంచి తీసుకున్న నిర్ణయాల్లో మెజారిటీ విప్లవాత్మకమైనవే. జగన్ సీఎం గా ప్రమాణం చేసిన తరువాత ప్రసంగించిన సమయంలో సచివాలయ వ్యవస్థ గురించి చెబుతూ దాని అమలుకు టైం బౌండ్ కూడా ఫిక్స్ చేశారు. ఆ ప్రకారం 2019 ఆగస్ట్ 15నాటికి వాలంటీర్లు, అక్టోబర్ 2 నాటికి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామంటే అంతా ఇది జరిగే పనేనా అనుకున్నారు. కానీ సరిగా ఆ టైం కి ఆయన అమలు చేసి చూపించారు. ఇక 2020 సంక్షేమ క్యాలండర్ ని తుచ తప్పకుండా అమలు చేశారు. సచివాలయ వ్యవస్థ మీద ఇప్పటికే కేరళ అస్సాం రాష్ట్రాలు ఆరా తీయడం జరిగింది. జగన్ తెచ్చిన దిశ చట్టం మీద మహారాష్ట్ర సర్కార్ ఆసక్తిని కనబరుస్తూ తామూ ఒక చట్టం తేవాలనుకుంటోంది.ఇక జగన్ మూడు రాజధానులు అంటే ఏపీలని మేధావులు సహా రాజకీయ పార్టీలన్నీ నవ్వాయి. ఇప్పటికీ హేళన చేస్తూనే ఉన్నాయి. తుగ్లక్ నిర్ణయం అని చంద్రబాబు పరుషమైన మాటనే వాడారు. కానీ పొరుగున ఉన్న వారికి మాత్రం జగన్ మాటే మంత్రంగా మారుతోంది. తమిళనాడులో రెండు రాజధానుల డిమాండ్ ఇప్పటికే ఊపందుకోగా రాజకీయ పార్టీ పెట్టిన కమల్ హాసన్ తాము అధికారంలోకి వస్తే మధురైని రెండవ రాజధానిగా చేస్తామని ఒక భారీ హామీ ఇచ్చేశారు. ఇది మరింతమంది ఎన్నికల హామీగా కూడా మారనుంది. ఇక ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కర్నాటకలోనూ అలాగే చేయాలని అక్కడి ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టడం జగన్ నిర్ణయాల బలాన్ని చాటి చెబుతోంది.జగన్ పేదలకు అమ్మ వొడి పధకం ద్వారా నగదు బదిలీ చేయడం కూడా పలు రాష్ట్రాల్లో పరిశీలనకు నోచుకుంటోంది. అలాగే ఇంగ్లీష్ మాధ్యమాన్ని సర్కారీ బడుల్లో ప్రవేశపెట్టడాన్ని కూడా కొన్ని రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇపుడు ప్రతీ నెల ఠంచనుగా ఒకటవ తారీఖుకే పించను పేదలకు వాలంటీర్ల ద్వారా జగన్ అందచేస్తున్నారు. అలాగే రేషన్ సరుకులు కూడా డోర్ డెలివరీ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఇపుడు దేశంలో చర్చ జరిగే కార్యక్రమాలుగానే ఉన్నాయని అంటున్నారు. ప్రతీ పార్లమెంట్ ని ఒక జిల్లాగా జగన్ ప్రకటించడాన్ని కూడా ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. మొత్తానికి జగన్ దార్శనికుడుగా అనతికాలంలోనే మారడం అంటే గొప్ప విషయంగానే చూడాలి అంటున్నారు.