ఏలూరు, డిసెంబర్ 24,
ఇటీవల ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో హద్దు మీరారని భావిస్తున్న టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అసెంబ్లీ స్పీకర్ చర్యలు ప్రారంబించినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా టీడీపీకి గట్టి వాయిస్ వినిపిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే, సభలో టీడీపీ ఉప నేత నిమ్మల రామానాయుడులపై చర్యలు తీసుకునే దిశగా పటిష్టమైన అడుగులు వేస్తున్నారని సమాచారం. ఇక, వీరిపై చర్యలు తీసుకునే అంశాన్ని సభా హక్కుల చైర్మన్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రె డ్డి నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు.టీడీపీ నేతలపై చర్యలు తీసుకునే విషయంలో సీఎం జగన్ నిర్ణయమే అంతిమమని వైసీపీ వర్గాలు ఎప్పటి నుంచో చెబుతున్నాయి. ఎందుకంటే.. సభలో ఆయన ఏం చెబితే అదే జరుగుతోంది. ఎవరికి మైక్ ఇవ్వాలన్నా.. తీసేయాలన్నా.. జగన్ కనుసైగతో శాసిస్తున్నారని.. టీడీపీ కూడా ఆరోపిస్తోంది. సభా వ్యవహారాలను గమనిస్తున్న వారికి ఇది నిజమేనని అనిపిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన సభలో సామాజిక పింఛన్ల విషయంలో ప్రభుత్వంపై నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో దూకుడు ప్రదర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 45 ఏళ్లు నిండిన వారికి ఇస్తానని చెప్పిన ఫించన్లకు ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికీ మధ్య వ్యత్యాసం ఉందని ఆయన సభలో విరుచుకుపడ్డారు.సీఎం జగన్ ఆయా వర్గాలకు అన్యాయం చేస్తున్నారని నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో సభలోనే ఉన్న జగన్.. నిమ్మల వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని సభలోకి కూడా రానివ్వొద్దని స్పీకర్‌కు అప్పటికప్పుడే సూచించారు. దీంతో వెంటనే నిమ్మల రామానాయుడును సస్సెండ్ చేయడం.. ఆ వెంటనే ఇతర సభ్యులు ఆందోళనకు దిగడం.. వారిని కూడా సస్సెండ్ చేయడం తెలిసిందే. ఇప్పుడు.. ఏకంగా ఈ ఇద్దరు నేతలు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నలపై చర్యలకు సభా హక్కుల కమిటీ భేటీ అయింది. ఈ క్రమంలో నిమ్మలకు నోటీసులు జారీ చేయాలని కమిటీ నిర్ణయించింది.గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ సభ్యురాలు రోజాపై ఏడాది పాటు ఎలా అయితే.. అప్పటి స్పీకర్ చర్యలు తీసుకున్నారో.. ఇప్పుడు అదే తరహాలో బదులు తీర్చుకునేందుకు వైసీపీ అధినేత సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే.. వచ్చే ఏడాది పాటు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీలోనూ, బయటా జగన్ ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా అచ్చెన్నాయుడు, రామానాయుడు కంట్లో నలుసుల్లా మారారు. వీరిద్దరు బలమైన విమర్శలతో జగన్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల్లో చంద్రబాబును వదిలేస్తే అచ్చెన్నాయుడు, రామానాయుడే ఎక్కువుగా వాయిస్ వినిపిస్తున్నారు. వీరిలో అచ్చెన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉండడంతో పాటు ఆయన్ను ఈఎస్ఐ స్కాంలో ఇప్పటికే అరెస్టు చేశారు. మళ్లీ ఆయన్ను సస్పెండ్ చేయడం కంటే రామానాయుడును సస్పెండ్ చేస్తే టీడీపీ నుంచి అసెంబ్లీలో మాట్లాడే వాళ్లే ఉండరు. అప్పుడు ప్రభుత్వానికి కౌంటర్లే ఉండవన్నదే వైసీపీ ప్లాన్. అయితే ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఎంత వరకు సమంజసం అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.