YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిరుపయోగంగా అమరావతి భవనాలు

నిరుపయోగంగా అమరావతి భవనాలు

విజయవాడ, డిసెంబర్ 24, 
రాజధానిలో సుమారు రూ.2800 కోట్లు వెచ్చించి చేపట్టిన నిర్మాణాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఉన్నతాధికారుల నివాసాలు, ఎన్‌జిఓలు, నాలుగో తరగతి ఉద్యోగులు ఇలా వేర్వేరు తరగతుల వారీగా నిర్మాణాలు చేపట్టారు. విస్తీర్ణాలనూ వేర్వేరుగా వర్గీకరించారు. వీటిల్లో చాలావరకూ నిర్మాణాలు పూర్తయ్యాయి. అందులోకి వెళ్లి ఉండటమే తరువాయి అని అప్పటి ప్రభుత్వం ప్రకటించినా వాటిని కేటాయించకుండా నిలిపేసింది. ప్రభుత్వం మారడంతో వాటిని ఏమి చేయాలనే నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకోలేదు. గుత్తేదారు కంపెనీలన్నీ వెళ్లిపోయాయి. రాజధానిలో సుమారు రూ.15,000 కోట్ల విలువైన పనులు మొదలుపెట్టారు. గుత్తేదారు కంపెనీలు వేలమంది కార్మికులను వేర్వేరు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పనులు చేయించాయి. పనులు నిలిపేయాలని 2019 జూన్‌లో ప్రభుత్వం ఆదేశించడంతో ఆయా కంపెనీలన్నీ కార్మికులను పంపించేశాయి. యంత్రాలను వేరే ప్రాజెక్టులకు తరలించాయి. పనులు చేసేందుకు తీసుకొచ్చిన విలువైన సామాగ్రి, అత్యాధునిక పైపులు, వైర్లు, ఇనుము ఇతర సామాగ్రి మొత్తం పాడైపోతోంది. ఇక్కడ ఉపయోగించడమూ లేదు. వేరేచోట ఉపయోగపెట్టుకోవడమూ లేదు. ఫలితంగా అవన్నీ దేనికీ పనికిరాని విధంగా తయారయ్యాయి. ఎన్‌జిఓల కోసం నిర్మించిన ఇళ్లయితే పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయి. రవాణా సదుపాయమూ బాగానే ఉంది. అయినా వాటిని కేటాయించలేదు. సిఆర్‌డిఎ ప్రధాన కార్యాలయం కొత్తగా నిర్మాణం చేపట్టారు. అది కూడా మధ్యలోనే నిలిచిపోయింది. సెక్రటేరియట్‌ టవర్ల కోసం వేసిన బేస్‌మెంట్‌ పూర్తిగా మునిగింది. వర్షాలకు నీరుకారి మట్టితో పూడుకుపోయింది. హైకోర్టుకు సమీపంలో నిర్మించిన సిబ్బంది నివాసాల్లోకి వర్షపునీరు చేరింది. ఇవన్నీ సెక్రటేరియట్‌కు కూతవేటు దూరంలో ఉన్నాయి. వాటి నుండి సెక్రటేరియట్‌కు దారివేస్తే ఎటువైపు నుండయినా ఐదు నిముషాల్లో సెక్రటేరియట్‌కు చేరుకోవచ్చు. ప్రభుత్వ సొమ్ముతో నిర్మించినప్పటికీ వాటిని వినియోగించుకోకుండా ఇప్పటికీ లక్షలాది రూపాయల అద్దె భవనాల్లోనే హెచ్‌ఓడి కార్యాలయాలు కొనసాగిస్తున్నారు.మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 2019 సెప్టెంబరులో రాజధాని పరిధిలో నిర్మించిన నిర్మాణాలు, ప్రారంభమైన పనులనూ పరిశీలించారు. చాలావరకూ వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైన వాటిని ప్రభుత్వ భవనాల కోసం వాడుకుంటామని తెలిపారు. 25 శాతం కంటే తక్కువ పూర్తయిన భవనాల టెండర్లను రద్దు చేస్తామని, పూర్తయిన వాటిని వినియోగించుకోవడంతోపాటు, అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాలకూ కేటాయిస్తామని తెలిపారు. ఆచరణలో అదేమీ జరగలేదు. అదే నెల 26వ తేదీన సిఆర్‌డిఎ కార్యాలయంలో జరిగిన రివ్యూ అనంతరం మీడియాతో బత్స సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబులాగా నిరుపయోగ ఖర్చులు చేయబోమని, ఉన్న నిర్మాణాలన్నీ వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు. త్వరలోనే ఖర్చు ఎంతవుతుందో కూడా చెబుతామని పేర్కొన్నారు. ప్రస్తుతం పూర్తిగా సిద్ధమైన భవనాల చుట్టుపక్కల మురుగునీరు చేరి కనీస వినియోగానికీ ఉపయోగం లేకుండా పోయింది.దాదాపు పూర్తయిన నిర్మాణాల్లో ఉద్యోగుల నివాసాలూ ఉన్నాయి. వారికి కేటాయించినవి అప్పగించడమో, రద్దు చేయడమో చేస్తే ఏదైనా సమస్య వస్తుందనుకుందేమో అలా చేయకుండా వదిలేసింది. ఫలితంగా నిరుపయోగంగా మారాయి. అవే కాదు రోడ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన పైపులైన్లలోకి మట్టి చేరింది. రోడ్డువైపునా డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్‌, ఇతర కేబుల్స్‌ నడిపించేందుకు వీలుగా డక్ట్‌ (భూగర్భ దారి) నిర్మించారు. ఇవన్నీ కూడా మట్టితో నిండిపోయాయి. మరలా బాగుచేయాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. కోట్ల రూపాయల ఖర్చు అయినప్పటికీ భవనాలు ఉపయోగం లేని విధంగా తయారయ్యాయి.

Related Posts