విజయనగరం, డిసెంబర్ 24,
రాజకీయాల్లో వారసులను హైలైట్ చేయడానికి ప్రయత్నించే నాయకులు ఎంతో మంది ఉన్నారు. తాము వెళ్ళిపోయినా తమ వారసత్వం రాజ్యాలను ఏలాలన్నది నాయకుల ఇన్నర్ ఫీలింగ్. ఇంటికి ఒక రాజకీయనాయకుడు వెలిగాడు అంటే.. ఇంట్లో ఉన్న వాళ్లు మాత్రమే కాదు.. ఇతరులు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తారు. తాజాగా బొత్స సత్యనారాయణ కూడా వారసుడిని పాలిటిక్స్ లోకి రంగంలోకి దింపాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. బొత్స కుటుంబం ముందు నుండి రాజకీయాల్లోకి వస్తూనే ఉంది. బొత్స భార్యను, ఇతర బంధువులను కూడా రాజకీయాల్లోకి తీసుకుని వచ్చారు. ఇప్పుడు వారసుడిని రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది.బొత్స భార్య ఝాన్సీ గతంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. ఆ తర్వాత ఎంపీగానూ ఉన్నారు. తమ్ముడు అప్పల నర్సయ్యను కాంగ్రెస్ హయాంలోనే ఎమ్మెల్యేను చేయగా, మరో కుటుంబ సభ్యుడు బడ్డుకొండ అప్పలనాయుడిని కూడా నెల్లిమర్ల నుంచి అసెంబ్లీకి పంపించారు. ఇలా ఇప్పటి వరకు భార్య, సోదరుడు, మేనల్లుడిని మాత్రమే రాజకీయాలకు పరిచయం చేశారు బొత్స సత్యనారాయణ. బొత్స కుమారుడు సందీప్‌బాబు రాజకీయాలకు దూరంగా విశాఖలో డాక్టర్‌గా స్థిరపడ్డారు. డాక్టర్ సందీప్ పుట్టినరోజు సందర్భంగా ఎన్నడూ లేనంతగా విజయనగరం అంతా ఫ్లెక్సీలు వెలియడంతో సందీప్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమైందని అనుకుంటున్నారు. కుమారుడిని తీసుకుని విజయవాడ వెళ్లిన బొత్స సత్యనారాయణ.. సీఎం జగన్ బర్త్‌డే సందర్భంగా రక్తదానం చేశారు. ఇదంతా పొలిటికల్ ఎంట్రీకి ముందు జరుగుతున్న పరిచయ కార్యక్రమాలని స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ వారుసుడిని పొలిటికల్ ఎంట్రీ చేయించాలని అనుకుంటే.. ఎక్కడ నుంచి పోటీ చేయిస్తారు అనే చర్చ మొదలైంది అప్పుడే..! చీపురుపల్లి నుంచి స్వయంగా బొత్స ఎమ్మెల్యేగా, గజపతినగరం బొత్స సోదరుడు అప్పలనర్సయ్య, నెల్లిమర్ల బడ్డుకొండ అప్పలనాయుడులతో ఉండగా.. ఇప్పుడు కుమారుడిని ఎక్కడి నుండి దింపుతారనే ప్రచారం జరుగుతూ ఉంది. ఈ రాజకీయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పలువురు నాయకులు తమ కుమారుళ్లను రాజకీయ నాయకులుగా ఎంట్రీ చేయిస్తున్నారు. త్వరలో బొత్స కూడా ఆ విషయంలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.