గుంటూరు, డిసెంబర్ 24,
గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌కు రేపో మాపో.. సీఎం జగన్ నుంచి పిలుపు అందుతుందన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన నాయకులు ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. తాజాగా తిరుపతికి చెందిన మంత్రి ఒకరు ఈ విషయాన్ని చూచాయగా మీడియాకు వెల్లడించారు. నందిగం సురేష్‌కు సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారని ఆయన అన్నారు. అయితే.. ఆ బాధ్యతలు ఏంటి? అనే విషయం మాత్రం గోప్యంగా ఉంది. ఇక, ఇప్పుడున్న పరిస్థితిలో సీఎం జగన్‌కు కీలకమైన విషయం ఏదైనా ఉంటే.. అది ఒకటి ఇళ్ల పంపిణీ, రెండు తిరుపతిలో రాబోయే ఉప ఎన్నిక. ఈ నేపథ్యంలో ఈ రెండు విషయాల్లో దేనిని ఆయన నందిగం సురేష్‌కు అప్పగిస్తారనే విషయం ఆసక్తిగా మారింది.పైగా ఈ రెండు విషయాలకే నందిగం సురేష్‌ను పిలుస్తున్నారా ? లేక మరేదైనా కారణం ఉందా ? అనే కోణంలోనూ వైసీపీలో చర్చ అయితే ఉంది. ఈ చర్చలు ఎలా ? ఉన్నా అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక విషయంలో ఇంచార్జ్ పోస్టు నందిగం సురేష్‌కు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. జగన్ అంటే అత్యంత విశ్వసనీయత ఉండడంతోపాటు.. మంచి ఫైర్ బ్రాండ్‌గా కూడా ఆయన ఇటీవల కాలంలో బాగానే పనిచేశారు. పైగా ఎస్సీ సామాజిక వర్గంలోనూ మంచి గుర్తింపు ఉంది. ఇక, రోడ్ల మీద బతికే తనను సీఎం జగన్ ఎంపీని చేశారంటూ.. ఆయన పండించిన సెంటిమెంట్ కూడా బాగానే వర్కవుట్ అయింది. ఈ క్రమంలో తిరుపతిలో ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించి.. ప్రచారాన్ని ఆయన కనుసన్నల్లో నడిపించే ఆలోచనలో జగన్ ఉన్నారని కూడా కొందరు వైసీపీ నేతలు చెపుతున్నారుప్రస్తుతం టీడీపీ కూడా ఇదే సూత్రాన్ని అవలంబిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలను ఇక్కడ రంగంలోకి దింపుతోంది. ఈ క్రమంలో మంది ఎక్కువగా ఉండకుండా .. సింగిల్ హ్యాండ్‌తో నెట్టుకువచ్చే వ్యూహం చేయాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా తనకు అనుకూలంగా ఉండడం, రేపు ఎవరైనా అమరావతి సెంటిమెంటును రెచ్చగొట్టినా.. ఆ ప్రాంత ఎంపీగా దానిని తిప్పికొట్టేందుకు, ఎస్సీ యువతను ప్రధానంగా ఆకర్షించేందుకు నందిగం సురేష్ ఉపయోగ పడతారని పార్టీ భావిస్తున్నట్టు ఆ మంత్రి చెప్పుకొచ్చారు. దీంతో ప్రచారం, ప్రజల్లోకి వెళ్లే అంశాల్లో నందిగం సురేష్ పై బాధ్యతలు అప్పగించేందుకు జగన్ ఆలోచన చేస్తున్నారనేది ఆయన చూచాయగా చెప్పిన మాట.ఇక తిరుపతి పార్లమెంటు సీటు కూడా ఎస్సీలకు రిజర్వ్ అయిన సీటు. అక్కడ టీడీపీ ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును ఖరారు చేయగా.. వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి పేరు వినవస్తోంది. ఇక్కడ ఇన్నర్‌గా బాధ్యతలు, ఆర్థిక వ్యవహారాలు పెద్దిరెడ్డికి అప్పగించినా, మెయిన్‌గా ప్రచారం, ఇతరత్రా బాధ్యతలు నందిగం సురేష్ చేతుల్లోనే పెట్టి టీడీపీకి చెక్ పెడతారని వైసీపీ నేతల టాక్. ప్రస్తుతం ఈ విషయం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. రేపో మాపో.. జగన్ నుంచి నందిగం సురేష్ కు పిలుపు వస్తుందని అంటున్నారు. ఇక సంక్రాంతి వెళ్లిన వెంటనే జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి తొలి వారంలో తిరుపతి ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడనుంది.