విజయవాడ, డిసెంబర్ 24,
రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులూ ఉంటాయి. ఓట్ల కోసం నేతలు చేసే ఫీట్లు జనాలకు కూడా చాలా బాగా అర్ధమవుతున్న రోజులివి. అయినా సరే మరీ దిగంబర నృత్యం చేస్తామంటే ఎవరికైనా బాగుంటుందా. అమరావతి రాజధాని విషయంలో బీజేపీ వేసిన పిల్లి మొగ్గలు మరెవరూ వేయలేదు. అంతెందుకు సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ఉందనగా రాయలసీమ డిక్లరేషన్ పేరిట బీజేపీ చేసిన హడావుడి చాలానే ఉంది. 2019 ఎన్నికల మ్యానిఫేస్టోలో కర్నూలు కి హై కోర్టు కావాలని కోరింది కూడా బీజేపీనే. అటువంటి పార్టీ ఇపుడు అడ్డం తిరిగేసింది. ఏపీకి ఏకైక రాజధాని అమరావతే అంటోంది.రాయలసీమ రగులుతున్న సంగతి అందరికీ తెలుసు. వారు చెప్పుకునేది ఏదైనా ఉంటే మా ప్రాంతం నుంచే ఎక్కువ మంది ముఖ్యమంత్రులు వచ్చారన్నది మాత్రమే. అక్కడ అభివృద్ధి జరిగింది మాత్రం ఏమీ లేదు అన్న వేదన ప్రతీ ఒక్కరిలోనూ ఉంది. ఎపుడో 1953లో కర్నూలు ని రాజధానిని చేసి ఆ సరదా ఏమీ తీరకుండానే ఉమ్మడి ఏపీ అంటూ చలో హైదరాబాద్ అని చెక్కేశారు. ఇక 2014లో విభజన జరినా కూడా కర్నూల్ కి రాజధాని ఊసే మళ్ళీ రాలేదు. పోనీ హై కోర్టూ లేదు. చంద్రబాబు అన్నీ అమరావతిలోనే అంటే ఇపుడు బీజేపీ సహా విపక్షాలు కూడా వంత పాడడం సీమజనానికి చిర్రెత్తిపోయే వ్యవహారమే.ఈ నేపధ్యంలో అమరావతి మన రాజధాని మూడు రాజధానులకు మా మద్దతు లేదు అంటూ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు చేసిన ప్రకటనతో వైసీపీ ఉలిక్కిపడింది. మోడీ మనిషిగా ఈ మాట చెబుతున్నానంటూ ఆయన గట్టిగా చేసిన సౌండ్ తో అలెర్ట్ అయిన జగన్ ఏకంగా ఢిల్లీలోనే ఆ కధ తేల్చుకోవాలనుకున్నారు. అందుకే ఆయన నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి గట్టిగానే బిగించేశారు. రాయలసీమకు హైకోర్ట్ రావాలన్నది బీజేపీ ఎన్నికల మ్యానిఫేస్టోలోనే పెట్టింది, దానికి శాసనసభలో వైసీపీ సర్కార్ ఆమోదించింది. ఇపుడు కేంద్రం నోటిఫికేషన్ ఇస్తే సీమవాసుల కల సాకారం అవుతుంది అని జగన్ అమిత్ షాకు చెప్పాల్సినదంతా చెప్పేశారు.ఇపుడు బంతిని తెచ్చి కేంద్రం కోర్టులో వేసిన జగన్ మూడు రాజధానులపైన వారూ వీరూ మాట్లాడడం కాదు, మోడీ, అమిత్ షా ఏమనుకుంటున్నారు అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇంతదాకా వచ్చాక మోడీ షా తప్పించుకునే వీలు అయితే లేదు. తాము అమరావతికే మద్దతు అని చెప్తే రాయలసీమకు పూర్తిగా చెడిపోతారు, ఉత్తరాంధ్రాలో కూడా పడిపోతారు. అవును అంటే ఎటూ జగన్ కి లాభమే. దాంతో సోము వీరావేశానికి జగన్ మార్క్ జవాబు అలా చెప్పారని అంటున్నారు. చూడాలి మరి కేంద్రం ఏం చేస్తుందో.