బెంగళూరు డిసెంబర్ 24
ఓ కిడ్నాప్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసు ఆఫీసర్‌కు కర్ణాటక హైకోర్టు శిక్ష విధించింది. శిక్ష ఏంటంటే.. వారం రోజుల పాటు తాను విధులు నిర్వర్తిస్తున్న పోలీసు స్టేషన్ ఎదుట ఉన్న రోడ్డును ఊడ్చాలని ఆదేశించింది కోర్టు. సురేశ్ అనే యువకుడు ఈ ఏడాది అక్టోబర్ 20న అదృశ్యమయ్యాడు. దీంతో సురేశ్ తల్లి తారాబాయి కలబురాగిలోని బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీంతో విసిగిపోయిన తారాబాయి.. కర్ణాటక హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఎఫ్ఐఆర్ నమోదు చేయనుందుకు స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌కు శిక్ష విధించింది. డిసెంబర్ 17వ తేదీన కోర్టు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వారం రోజుల పాటు పోలీసు స్టేషన్ ముందు ఉన్న రోడ్డును ఊడ్చాలని కోర్టును ఎస్‌హెచ్‌వోను ఆదేశించింది. సురేశ్ ఆచూకీ ఇంకా తెలియలేదు. కోర్టు ఆదేశాలతో సురేశ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే జీరో ఎఫ్ఐఆర్‌పై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్ లేదా ఓరియంటేషన్ తరగతులు నిర్వహించాలని జిల్లా ఎస్పీని కోర్టు ఆదేశించింది.