ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గజ దొంగల ముఠాలు దొంగతనాలకు వెళ్లిన సమయంలో అడ్డుకునేవారిపై దాడిచేసి హతమార్చేందుకు సైతం వెనుకాడవు. గతంలో బిహార్‌కు చెందిన దోపిడీ ముఠా వట్టిచెరుకూరు వద్ద ఓ పెట్రోలు బంకులోకి ప్రవేశించి డబ్బులు దోచుకోవడంతోపాటు సిబ్బందిపై దాడి చేసి విచక్షణా రహితంగా నరికి చంపిన విషయం అందరికి తెలిసిందే. ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి వచ్చే గజదొంగల ముఠాలు శివారుప్రాంతాల్లోని రైల్వే ట్రాక్‌లు, ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తాయి. పగటి పూట పూసలు, బొమ్మలు అమ్ముతున్నట్లుగా తిరుగుతూ చోరీలు చేయాల్సిన ఇళ్లపై రెక్కీ నిర్వహించడం ఈ ముఠాల ప్రత్యేకత. ఎవరికీ అనుమానం రాకుండా మహిళల ద్వారానే రెక్కీ నిర్వహిస్తారు. ఇప్పటికే రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో పార్ధివ్ గ్యాంగ్‌లు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాలు ధృవీకరించడంతో అన్ని జిల్లాల పోలీసులు అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఈ వారంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఇదే అదునుగా భావించిన ముఠాలు జిల్లాలో మకాం వేసి ఉంటారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.