YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బెంగళూర్ లో రాత్రిపూట కర్ఫ్యూ

బెంగళూర్ లో రాత్రిపూట కర్ఫ్యూ

బెంగళూర్, డిసెంబర్ 24    
కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్ వ్యాప్తి వార్తల నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. గడిచిన వారం రోజులుగా యూకే సహా ఐరోపా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి బెంగళూరు నగరంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. ఇందులో భాగంగా గురువారం (డిసెంబర్ 24) రాత్రి నుంచి నగరంలో 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.నేటి రాత్రి నుంచి జనవరి 1 వరకు బెంగళూరులో రాత్రిపూట కర్ఫ్యూ, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. కర్ఫ్యూ నేపథ్యంలో బెంగళూరు నగరంలో ఇప్పటికే భారీగా పోలీసులను మోహరించారు.కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని కమిషనర్ కమల్ పంత్ హెచ్చరించారు. మెడికల్‌ షాప్‌లు మినహా ఇతర దుకాణాలు, షాపింక్ కాంప్లెక్సులను రాత్రి 11 గంటల లోపు మూసివేయాలని స్పష్టం చేశారు. 11 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడంలేదని తెలిపారు. ఎవరైనా అనవసరంగా రోడ్ల మీద తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ప్రజా రవాణా, నిత్యావసర వస్తువుల రవాణా వాహనాలు, ఎయిర్‌పోర్టులకు వెళ్లే టాక్సీలను మాత్రం అనుమతిస్తామని కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. రాత్రి 11 గంటల తర్వాత అత్యవసర సేవలు మినహా వేటికీ అనుమతి ఉండదని స్పష్టం చేశారు. సున్నితమైన ప్రాంతాలు, ఫ్లైఓవర్లు, ప్రధాన రహదారులపై పెట్రోలింగ్‌ నిర్వహించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.కర్ఫ్యూ అమల్లో ఉన్నన్ని రోజులు 50 శాతం సామర్థ్యంతో పనిచేసే కంపెనీలు, పరిశ్రమల్లో రాత్రిపూట షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులను అనుమతించనున్నారు. దూర ప్రాంతాలకు బస్సులు, రైళ్లు, విమానాల్లో వెళ్లే ప్రయాణికులు, దూర ప్రాంతాల నుంచి తిరిగొచ్చే వారిని అనుమతించనున్నారు. అయితే, అలాంటి ప్రయాణికుల వద్ద సంబంధిత ధ్రువీకరణ పత్రాలు (టిక్కెట్లు) ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు వచ్చే, ఆ నగరాలకు వెళ్లే ప్రయాణికులు ఈ నిబంధనలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది.

Related Posts