రాజధానిలో భూమిని వినియోగించకపోవడం, సాగుచేసుకునే అవకాశమూ ఇవ్వకపోవడంతో మొత్తం ముళ్ల చెట్లు పెరిగాయి. వందల లారీలు తిరిగిన రోడ్లన్నీ ముళ్ల కంపలతో నిండిపోయాయి. ఉన్నతాధికారుల కోసం నిర్మించతలపెట్టిన భవనాల్లోనూ కొన్నిచోట్ల చెట్లు మొలిచాయి. పెద్దపెద్ద రోడ్లన్నీ మూతపడ్డాయి. ఎక్కడకక్కడ నీళ్లతో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. అధునాతన డంపింగ్‌యార్డులు నిర్మించినా వినియోగంలోకి రాకముందే వర్షపునీళ్లతో నిండిపోయాయి. వంద అడుగుల వెడల్పుతో వేస్తున్న రోడ్లూ ఎక్కడికక్కడ పాడైపోయాయి. మొత్తంగా రాజధాని ప్రాంతంలో జరిగిన పనంతా దుర్వినియోగం అయింది. ఇప్పుడు రోడ్లు నిర్మించాలన్నా ఆర్థిక పరిస్థితి అనుకూలించే వాతావరణం కనిపించడం లేదు. గతంలో విట్ యూనివర్శిటీ నుంచి కోర్టు భవనాలకు వెళ్లేందుకు వేసిన రోడ్డు పూర్తిగా పాడైపోయింది. వర్షాలు పడటంతో ఎక్కడక్కడ నీరు నిలిచి అవన్నీ బురదమయంగా మారాయి. కోర్టు భవనాల నుంచి శాఖమూరులో ఏర్పాటుచేసిన అంబేద్కర్ ఉద్యానవనానికి వెళ్లేదారి పూర్తిగా కంపతో నిండిపో యింది. మామూలు వ్యక్తులు అక్కడకు వెళ్లాలంటే వణుకుతూ వెళ్లాల్సినంతగా పరిస్థితి నెలకొంది. గతంలో ఫలానా రోడ్డుపై వెళితే అక్కడకు వెళ్లొచ్చు అనే గ్యారంటీ ఉండేది. ప్రస్తుతం అలాంటిదేమీ కనిపించడం లేదు. రోడ్డు నిర్మాణం పేరుతో తవ్వేసి గుంటలు వదిలేయడంతో ఎక్కడికక్కడ చిన్న చెరువులు ఏర్పడ్డాయి.గతంలో ఉన్నతాధికారుల కోసం, జడ్జిల కోసం నిర్మించతలపెట్టిన భవనాలన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. పెద్దపెద్ద నిర్మాణాల కోసం వందల కోట్లతో వేసిన పునాదులు పనికిరాని విధంగా తయారయ్యాయి. వెంకటపాలెం, మందడం, నేలపాడు, ఐనవోలు, శాఖమూరు, అనంతవరం, నెక్కల్లు, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, రాయపూడి పరిధిలో పొలాలన్నీ చిట్టడవులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు క్లోజ్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీనిపై మందడానికి చెందిన రైతు జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ పంటలు పండాల్సిన భూముల్లో ముళ్ల చెట్లను చూడలేకపోతున్నామని, రాజధాని వస్తుందంటే భూములు ఇచ్చామని, ఇలా జరుగుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోరుపాలెం రైతు జె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చిన్నప్పటి నుండి తిరిగిన భూములు ఇప్పుడు ముళ్ల కంపతో కాలుపెట్టడానికి కూడా వీలు లేకుండా పోయిందని చెప్పారు. తొలి నుండీ పూలింగుకు ఇవ్వకుండా ఎదురుతిరిగిన మల్కాపురం రైతులు కూడా దున్ని సాగు చేసుకుందామంటే వీలులేని పరిస్థితి ఏర్పడింది. ముళ్ల కంప తొలగించాలంటే మనుషులతో సాధ్యం కావడం లేదు. పొక్లెయినర్లు తీసుకొచ్చి తొలగించాల్సినంత మొదళ్లు ఏర్పడ్డాయి. మూడు పంటలు పండే భూములు ఇప్పుడు ముళ్లను పండిస్తున్నాయని మందడం రైతు బి.రమేష్‌బాబు తెలిపారు. వైఎస్‌ఆర్‌సిపికి చెందిన ఈయన తొలి నుండి వైసిపి పక్షాన నిలబడి భూములు ఇచ్చేందుకు సిద్ధపడలేదు. ప్రభుత్వ ఒత్తిడితో చివరకు ఇచ్చేశారు. ఇప్పుడు ఎటూ కాకుండా పోవడంతో రైతుల ఆందోళనలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటున్నారు. ఒకప్పుడు ఆయన ఇక్కడ పెద్దరైతు. పూలింగును తీవ్రంగా వ్యతిరేకించారు. నేలపాడుకు చెందిన రైతు రామారావు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పొలం పనులు చేసుకుని బతికేవారికి ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కావడం లేదని అంటున్నారు.