YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గుంటూరు ను ఠారెత్తిస్తున్న దొంగలు

గుంటూరు ను ఠారెత్తిస్తున్న దొంగలు

గుంటూరులో గజ దొంగల ముఠాలు సంచరిస్తున్నాయి.. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీకి చెందిన కరుడుగట్టిన గజదొంగల ముఠాలు నగరంలో తిష్టవేశాయని నిఘా వర్గాల హెచ్చరించడంతో అర్బన్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. వరుస దొంగతనాలతో గుంటూరు నగరవాసులకు కంటిపై కునుకు కరువైంది. ఈ తరుణంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన గజదొంగల ముఠా సంచరిస్తుందనే సమాచారం బయటకు పొక్కడంతో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన గజ దొంగల ముఠా సంచరిస్తున్నారనే నిఘా వర్గాల హెచ్చరికతో అర్బన్‌ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాలతోపాటు, శివారు ప్రాంతాల్లో నివశించే కొత్త వ్యక్తులపై నిఘా ఉంచారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరెవరిని కలుస్తున్నారు? అనే సమాచారం తెలుసుకునేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం తెల్లవారుజామున నగర శివారులోని పలు ప్రాంతాలతోపాటు, నగరంలో దొంగల ముఠా సంచరించినట్లుగా అనుమానిస్తున్న పలు ప్రాంతాల్లో అర్బన్‌ జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు ప్రత్యేక బలగాలతో కలిసి భారీ ఎత్తున కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించాలని అర్బన్‌ జిల్లా ఎస్పీ సిహెచ్‌.విజయరావు నిర్ణయించారు. అంతేకాకుండా మూడు నెలల వ్యవధిలో జైళ్ల నుంచి విడుదలైన నేరస్తుల జాబితాను సేకరించారు. కార్డెన్‌ సెర్చ్‌లో భాగంగా నేరస్తుల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించనున్నారు. అర్బన్‌ జిల్లా పరిధిలో సస్పెక్టెడ్‌ షీట్‌లు కలిగి ఉన్న 90 మందిపై సైతం పూర్తిస్థాయి నిఘా ఉంచారు. నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వీరి కార్యకలాపాలు మొదలవక ముందే కట్టుదిట్టమైన ముందస్తు జాగ్రత్త చర్యలను చేపడుతున్నారు.రాజధాని ప్రకటన నుంచి గుంటూరు నగరానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి తాకిడి ఎక్కువైంది. నగర జనాభా కూడా పెరిగింది. దీంతో కొత్త వ్యక్తులపై పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టలేకపోతున్నారు. దీంతో అప్పటి నుంచి చైన్‌స్నాచింగ్‌లు, దోపిడీ, దొంగతనాలు, పెరిగిపోయాయి. సిబ్బంది కొరతతోపాటు, వరుస బందోబస్తులు, ఆందోళనల నేపథ్యంలో నేరస్తులపై పూర్తిస్థాయి నిఘా ఉంచలేకపోతున్నారు. వేసవి కాలం రావడంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి సైతం వివిధ పేర్లతో దొంగల ముఠాలు రాజధాని నగరంపై కన్నేశాయని ఇంటిలిజెన్స్‌ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో ఈ ముఠాల పనిపట్టేందుకు గుంటూరు అర్బన్‌ జిల్లా ఎస్పీ సిహెచ్‌.విజయరావు పక్కా ప్రణాళిక రూపొందించి దొంగల ముఠాల ఆటకట్టించేందుకు సమాయత్తం అవుతున్నారు.

Related Posts