YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాజ్యాంగం, దళితులపై దాడి జరుగుతోంది దళితులు సంఘటితంగా ఉంటేనే ప్రభుత్వాలు, పార్టీలు భయపడుతాయి - ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

రాజ్యాంగం, దళితులపై దాడి జరుగుతోంది   దళితులు సంఘటితంగా ఉంటేనే ప్రభుత్వాలు, పార్టీలు భయపడుతాయి - ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

ఇటీవల రాజ్యాంగంపై, దళితుల హక్కులు, ప్రాథమిక హక్కులపై దాడి జరుగుతోందని, ఇది మంచి పరిణామం కాదని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇప్పుడిప్పుడే ఎస్సీ, ఎస్టీలు ఎదిగి వస్తున్నారని, తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నారని, ఇది తట్టుకోలేక, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అణచివేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ 127వ జయంతి ఉత్సవాలు సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ...నేడు అంబేద్కర్ గురించి మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి అన్ని పార్టీలకు ఉందన్నారు. ఎంతో ముందు చూపుతో ఆయన రాసిన రాజ్యాంగం నేటి సమకాలీన సమస్యలకు కూడా పరిష్కారం చూపుతోందన్నారు. అంబేద్కర్ జయంతిని కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రపంచమేథావిగా అంబేద్కర్ ను గుర్తించి ఐక్య రాజ్యసమితి కూడా అంబేద్కర్ జయంతిని అధికారికంగా నిర్వహించడం మనకు ఎంతో గర్వకారణమన్నారు.

        డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన జాతి నిద్రావస్థలో ఉందని, ఆ జాతిని మేల్కొలిపేందుకు తాను నిద్రపోకుండా రాజ్యాంగాన్ని రచించారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి లిఖిత పూర్వక రాజ్యాంగం ఉండాలని ఆ రాజ్యాంగ రచన కోసం ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ పరిషత్ నియమించారన్నారు. అయితే ఈ ఏడుగురులో ఒకరు చనిపోయారని, రెండో వారు అమెరికా వెళ్లారని, మూడోవారు రాజకీయాలకు వెళ్లారని, నాల్గోవారు రాజీనామా చేశారని, ఐదోవారు ప్రభుత్వంలో పనిచేస్తుండగా....డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక్కరే రాజ్యాంగ రచన బాధ్యతలన్నీ స్వీకరించి దానిని పూర్తి చేశారని ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్న కృష్ణమాచారి చెప్పారన్నారు. దీనిని బట్టి అంబేద్కర్ గొప్పతనం ఏంటో తెలుస్తుందన్నారు. ఆరు దశాబ్దాల పోరాటం, అమరుల త్యాగ ఫలితం, కేసిఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ పోరాటం జరిగినా... ఆయన రాసిన ఈ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3వల్లె తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు.

        దళితులపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా రక్షించేందుకు గతంలో పీసీఆర్ చట్టం ఉండేదని, అయితే దీనివల్ల ఈ హత్యలు, అత్యాచారాలు ఆగడం లేదని 1989లో వీపీ సింగ్ ప్రధానిగా, రామ్ విలాస్ పాశ్వాన్ సోషల్ జస్టిస్ మినిష్టర్ గా ఉన్నప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టం తీసుకొచ్చారన్నారు. ఈ చట్టంలో అనేక రక్షణలు ఉన్నాయని, అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాల వల్ల సుప్రీం కోర్టు దీని కోరలు తీసేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే ఇలా జరిగిందన్నారు. మరికొంతమంది ఇప్పుడు రిజర్వేషన్లు ఎత్తివేయాలని ఆందోళన చేస్తున్నారని, ఇలాంటి సంఘటనల పట్ల దళితులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దళితులు సంఘటితంగా ఉన్నపుడే పార్టీలు, ప్రభుత్వాలు కూడా భయపడుతాయని తెలిపారు.

        తెలంగాణ ప్రభుత్వం బి.ఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని, అంబేద్కర్ స్మృతి వనాన్ని ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ వద్ద జరిగిన చర్చలో ఇంకా దళితుల కోసం ఏం చేయాలని అడిగినప్పుడు...దళితబిడ్డలకు నాణ్యమైన విద్య అందించేందుకు 125వ జయంతి సందర్భంగా 125 గురుకులాలు ఏర్పాటుచేయాలని తాను కోరానని, అయితే సిఎం కేసిఆర్ ఏకంగా ఈ మూడేళ్లలో 577 గురుకులాలు ఇచ్చారని చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. దేశంలో పది లక్షల మందికి గురుకుల విద్య అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు. ఈ గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు పోషకవిలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. ఇటీవల వచ్చిన ఇంటర్ ఫలితాల్లో ప్రైవేట్ కాలేజీలను పక్కకు నెట్టి గురుకుల కాలేజీలు మొదటి స్థానంలో నిలిచాయన్నారు. గురుకులాల తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజీలు నిలిచాయని, చివరి స్థానంలో ప్రైవేట్ కాలేజీలున్నాయన్నారు.

        ఆర్ధిక సహకార పథకాల రూపకల్పన కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ తనను చైర్మన్ గా జోగురామన్న, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి కమిటీ ఏర్పాటు చేసినారని, ఈ కమిటీలో 80శాతం సబ్సిడీ, 20 శాతం లోన్ ఉండేలా తాము ప్రతిపాదనలు చేస్తే ముఖ్యమంత్రి కేసిఆర్ అంగీకరించారని చెప్పారు. గతంలో 80శాతం లోన్, 20 శాతం సబ్సిడీ ఉండేదని తెలంగాణ ప్రభుత్వంలో దానిని రివర్స్ చేశామన్నారు. అయినా ఈ 20 శాతం లోన్ కూడా ఇవ్వడానికి బ్యాంకులు ఇబ్బందులు పెడుతున్నాయని, పెద్దోళ్లు మాత్రం వేలకోట్లు బ్యాంకులను ముంచుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో అంబేద్కర్ బాటలో నడుస్తుందని చెప్పారు.

        ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టిఎస్పిఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే బాబూ మోహన్, ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు నాయక్, సచివాలయం ఎస్సీ, ఎస్టీ సంఘం నేతలు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts