ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి వారిని దర్శించు కోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.భక్తుల దర్శనార్థం వైకుంఠ ద్వారంలో గరుడ వాహనంపై కోదండరాముడు కొలువు దీరాడు. తెల్లవారు జామున 5 గంటల నుంచే సీతారామ లక్ష్మణుల దర్శనం కోసం భక్తజనం పోటెత్తారు. కోదండ రామాలయం మొత్తం గోవింద నామ స్మరణతో మార్మోగిపోయింది.
తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యనారాయణ స్వామిని ఉత్తరద్వారం దిశగా భక్తులు దర్శించుకుంటున్నారు. శేష పానుపు పై సత్యనారాయణ స్వామి అనంత లక్ష్మి సత్యవతి అమ్మవార్లు ఉత్తర ముఖంగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు.ఈ సందర్భంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఉత్తర ద్వారం గుండా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు.
విశాఖపట్నంలో సింహచల వరహా లక్ష్మీ నరసింహ స్వామి ఆయలం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సిద్దమైంది. పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కోవిడ్ నియామాలు అనుసరించి భక్తులు దర్శనం చేసుకునేలా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.దేవస్థాన ఛైర్మన్ సంచయిత గజపతి, ట్రస్ట్ బోర్డ్ సభ్యులతో పాటు తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.
గుంటూరు జిల్లాలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ అధికారులు ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాటు చేశారు. ఉదయం 3.30 గంటల నుంచే భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. కోవిడ్ కారణంగా అధికారులు ఆలయంలో శంఖు తీర్థం నిలిపివేశారు.60సంవత్సరాల వృద్ధులు, 10 సంవత్సరాలు లోపు పిల్లలకి గుడిలోకి అనుమతించలేదు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.