ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కబ్జాలు చేసే కబ్జాకోరు వెలగపూడికి విజయసాయిరెడ్డి నివిమర్శించే అర్హత లేదని విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అక్కరమాని
విజయనిర్మల పేర్కొన్నారు. శుక్రవారం ఎంవీపీ కాలనీ లోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కబ్జాలు, భూ దందాలు చేసే వెలగపూడి నీతులు
చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆమె విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అవినీతికి తావులేకుండా అన్ని సంక్షేమ పథకాలను లబ్ధిదారుల
బ్యాంక్ ఖాతాల్లోనే వేస్తున్నామన్నారు. వెలగపూడి యువసేన అధ్యక్షుడనే పేరుతో హల్చల్ చేస్తున్న వెలగపూడి అనుచరుడు సందీప్ ముడసర్లోవలో చేస్తున్న ఆగడాలు, అక్రమాలకు అంతు
లేదన్నారు. ఒక్కొక్కరి వద్ద 50000 రూపాయలు వసూలు చేసి దేవస్థానం భూముల్లో నిర్మాణాలకు అనుమతించేవారంటే వారి గూండాగురి ఏమిటో స్థానిక ప్రజలకు తెలుసన్నారు. టీడీపీ
నాయకుడు దువ్వి తాతా రావు రామకృష్ణాపురం లో 2ఎకరాలు ఆక్రమించి నిర్మాణం చేపట్టారన్నారు. మాజీ కార్పొరేటర్ చోడె పట్టాభిరాం ఆదర్శనగర్ లో పార్కు నాక్రమించి భవంతి
నిర్మించారన్నారు. ఋషికొండలో తనకున్న 6సెంట్ల భూమికి ప్రక్కనున్న గెడ్డ పోరంబోకును వెలగపూడి పూర్తిగా ఆక్రమించా రన్నారు. వెంకోజీపాలెం జ్ఞ్యాన సరస్వతి ఆశ్రమ భూమిని నార్త్
స్టార్ సంస్థ ద్వారా వెలగపూడి అనుచరులు బెదిరించి ఆక్రమణ చేశారన్నారు. 1988 డిసెంబర్ 26న హత్య కావించ బడ్డ కాపు నాయకుడు వంగవీటి మోహనరంగ హత్యలో 3వ నెంబర్
ముద్దాయిగా ఉన్న వెలగపూడి విశాఖకు రిక్తహస్తాలతో వచ్చి, భూ దందాలు, కబ్జాలు చేసి కోట్లకు పడగలెత్తారని ఆమె దుయ్యబట్టారు. అటువంటి వ్యక్తి పవిత్రమైన సాయిబాబా మీద
ప్రమాణం చేస్తానంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. వారి అధినేత చంద్రబాబుకు మతి భ్రమించినట్లే, వెలగపూడికి కూడా మతి భ్రమించిందన్నారు. అయితే అతను
సవాలు చేసినట్లు ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా దేవాలయంలో ప్రమాణానికి శనివారం రావాలన్నారు. లేని యెడల తామే సాయిబాబా ఫోటో తీసుకుని వెలగపూడి ఇంటికి
వెళతామన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి మొల్లి అప్పారావు, కార్పొరేటర్ అభ్యర్థి మువ్వల లక్ష్మీ సురేష్, గెదల నాగరాజ, పీతల గోవింద్,సురాడవెంకటలక్ష్మి,
సుశీల సుధాకర్, బోండా శ్రీను తదితరులు పాల్గొన్నారు.