YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసంద్రమైన బెజవాడ

 జనసంద్రమైన బెజవాడ

ఆంధ్రప్రదేశ్ ధర్మపోరాటానికి వేదికైంది. రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన దీక్షకు ప్రజానీకం మద్దతుగా నిలిచింది. జన్మదినాన్నే.. ముఖ్యమంత్రి కొనసాగించిన ధర్మపోరుకు అన్ని వర్గాలూ అండగా నిలబడ్డాయి. సీఎం కూర్చున్న దీక్షా ప్రాంగణమైతే జనసంద్రాన్ని తలపించింది. లక్షలాది తెలుగువారితో కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నుంచే కాక దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన మద్దతుదారులతో బెజవాడ హోరెత్తిపోయింది. మొత్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదనలో నవ్యాంధ్ర ప్రజానీకం భాగమైంది. పుట్టిన రోజునే కేంద్రంపై ఆయన చేస్తున్న ధర్మపోరాట దీక్షకు వెన్నెముకగా నిలిచింది. ముఖ్యమంత్రికి అండగా నిలబడింది. సరిగ్గా ఏడు గంటలకే దీక్ష స్థలికి చేరుకున్నారు ముఖ్యమంత్రి. మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌, జ్యోతిరావు పూలే, ఎన్టీఆర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేశారు. తర్వాత ‘మా తెలుగు తల్లికి మల్లెపూ దండ’ ఆలపించారు. దీక్షలో చంద్రబాబుతో పాటు నారో లోకేశ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య  సమరయోధులు పావులూరి శివరామకృష్ణ చంద్రబాబుకు నూలుపోగు దండ వేసి అభినందించారు. దీక్షా వేదికపై చంద్రబాబుకు పక్కగానే శివరామకృష్ణ మరో కుర్చీలో ఆశీనులయ్యారు.

 

సర్వమత ప్రార్ధనలు, మతపెద్దల ఆశీర్వచనాలతో ముఖ్యమంత్రి దీక్ష ప్రారంభమైంది. చంద్రబాబు వేదికపైకి రాగానే టీటీడీ, దుర్గగుడికి చెందిన వేదపండితులు, క్రైస్తవ, ముస్లిం మతపెద్దలు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం పలువురు స్వాతంత్య్ర సమరయోధులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. మాజీ సైనికులు కూడా ముఖ్యమంత్రిని కలసి సంఘీభావం ప్రకటించారు. 68ఏళ్ల  వయసులో ముఖ్యమంత్రి చేపట్టిన దీక్షకు వివిధ పార్టీలు, స్వచ్ఛంద, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. చంద్రబాబుకు సంఘీభావంగా టీడీపీ శ్రేణులు, వివిధ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు నిర్వహించాయి. ఏ జిల్లాకు చెందిన మంత్రుల్ని ఆ జిల్లాలోనే దీక్షల్లో పాల్గొనాల్సిందిగా చంద్రబాబు సూచించారు. దీంతో వారంతా తమ జిల్లాల్లోనే దీక్షలు చేపట్టారు. రాష్ట్ర హక్కుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన సత్యాగ్రహానికి ప్రజలు మద్దతుగా నిలిచారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, వాణిజ్య సంఘాలు, ప్రజాసంఘాలు, వివిధ సంస్థలు, యూనియన్లు ముఖ్యమంత్రి దీక్షకు మద్దతు ప్రకటించాయి. రైతులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు పెద్దఎత్తున దీక్షల్లో పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వం నవ్యాంధ్ర అభివృద్ధికి చేయూతనివ్వాలని డిమాండ్ చేశారు.

Related Posts