మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు షాకిచ్చారు. ఆయనతో పాటూ మరికొందరిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల ఘర్షణపై జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటూ
మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ 307 సెక్షన్ల కింద కేసులు ఫైల్ అయ్యాయి. అలాగే వైఎస్సార్‌సీపీ-టీడీపీ వర్గీయులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి.. ఘర్షణకు కారణమైన వలీ అనే వ్యక్తిపై
కేసు నమోదైంది. రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. జేసీ వర్గీయుల తమపై దాడి చేశారని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మనోజ్, బ్రహ్మేంద్రలు.. తమను
కులం పేరుతో దూషించారని ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. తాడిపత్రిలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.. పోలీసుల్ని
మోహరించారు.అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ గ్రూపుల మధ్య వార్ జరిగింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఆగ్రహంతో నేరుగా జేసీ ఇంటికి వెళ్లారు. తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జేసీ అనుచరులపై మండిపడ్డారు. అక్కడే
ఉన్న ఇద్దరు యువకులపై దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో జేసీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేరని చెబుతున్నారు.పెద్దారెడ్డి వచ్చిన విషయం
తెలిసి జేసీ వర్గీయులు మరి కొంత మంది అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభాకర్ రెడ్డి ఇంటి సమీపంలో రెండు వర్గాలకు చెందిన వాళ్లు రాళ్లు
రువ్వుకున్నారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పరిస్థితిని చేయి దాటిపోతుండటంతో లాఠీఛార్జ్ చేశారు. అయినా.. పట్టించుకోకుండా ఇరు వర్గాలు ఘర్షణకు దిగడం గమనార్హం. ఈ
ఘటనలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ విషయం తెలియడంతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి వచ్చారు.
ఈ పరిణామాల నేపథ్యంలో తాడిపత్రిలో భారీగా పోలీసులను మోహరించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.