నెల్లూరు, డిసెంబర్ 26,
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం, విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నంలో కొత్తగా 800 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం 2015లో టెండర్లు పిలిచింది. బాయిలర్, టర్బైన్ జనరేటర్ పనులను బీహెచ్‌ఈఎల్‌కు ఇచ్చారు. పర్యావరణాన్ని దెబ్బతీసేలా థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి విషకారకాలు గాల్లోకి వెళ్తాయి. వీటిని నిరోధించడానికి కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్లు విధిగా ఐదు మార్గదర్శకాలు పాటించాలని కేంద్రం సూచించింది. ప్లాంట్ల నుంచి వచ్చే పాదరసాన్ని తగ్గించాలి. థర్మల్ ప్లాంట్లకు వాడే నీటిని పునర్వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. చిమ్నీ ఎత్తు పెంచడం ద్వారా విషవాయువులను ఎత్తులో విడిచిపెట్టాలి. పొగద్వారా వచ్చే సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌ను తగ్గించాలని కేంద్రం పేర్కొంది. వాస్తవానికి జెన్‌కో ప్లాంట్లలో ఈ దిశగా తొలిదశలోనే కాంట్రాక్టులో పెట్టారు. అయితే ఇప్పుడు లైమ్‌స్టోన్ ప్లాంట్, రియాక్టర్ పెట్టాలని, జిప్సమ్ అన్‌లోడింగ్‌కు ఏర్పాట్లు చేయాలని జెన్‌కో అధికారులు చెబుతున్నారు.కృష్ణపట్నంలో టాటా పవర్‌కు, ఇబ్రహీంపట్నంలో బీజీఆర్ కంపెనీలకు బీవోపీ (బ్యాలన్స్ ఆఫ్ ప్లాంట్) అప్పగించారు. ఈ రెండు సంస్థలకు అనుకూలంగా నిబంధనలు పెట్టినట్టు అప్పట్లో తీవ్ర ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారంలో రూ. 2,600 కోట్ల అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. పర్యావరణంపై 2015 పారిస్ ఒడంబడికలో భాగంగా థర్మల్ ప్లాంట్లలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌లను తగ్గించాలని నిర్ణయించారు. కేంద్ర పర్యావరణ శాఖ కూడా ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఇది జరిగిన తర్వాతే ఏపీ జెన్‌కో రెండు థర్మల్ ప్లాంట్లకు టెండర్లు ఖరారు చేసింది. కాంట్రాక్టులో ఈ ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా పాదరసం తగ్గించడం, నీటి వినియోగం అదుపులో ఉంచడం, చిమ్నీ ఎత్తు తదితరాలు కాంట్రాక్టులో పెట్టారు. వీటిద్వారా కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనల మేరకు ప్లాంట్ నిర్మాణం చేపట్ట వచ్చు. పర్యావరణ హితంగా రెండు ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం రూ. 9,720 కోట్లకు చేరుతుంది. ఇప్పుడు రెండు ప్లాంట్లలోనూ ఫ్లూగ్యాస్ డీ సల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని ఏపీ జెన్‌కో నిర్ణయించింది. ఇందుకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ టెండర్ల నిబంధనలు టీడీపీ నేతల కంపెనీలకు అనుకూలంగా ఉండేలా రూపొందిస్తున్నారు. ఇప్పటికే రెండు థర్మల్ ప్లాంట్లలో ప్రధాన కాంట్రాక్టు సంస్థలు ఇచ్చిన సబ్ వర్క్స్ చేసి ఉండాలనే నిబంధనను పెడుతున్నారు. ఈ ప్లాంట్లలో సబ్ కాంట్రాక్ట్ పనులన్నీ టీడీపీ నేతల కంపెనీలకే ఇచ్చారు. అయితే, ఇతర రాష్ట్రాలు కాంట్రాక్టులను ఏక మొత్తంలో ఇచ్చాయి. కానీ ఏపీ జెన్‌కో మాత్రం విడివిడిగా ఇచ్చింది. బీవోపీ వ్యయాన్ని పెంచడానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల సాకుతో.. ఎఫ్‌జీడీ ప్లాంట్ల నిర్మాణం పేరు చెప్పి థర్మల్ ప్లాంట్ల నిర్మాణ వ్యయాన్ని మరో రూ. 3 వేల కోట్లు పెంచేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. అయితే రెండు థర్మల్ ప్లాంట్లకు 2016 తర్వాతే పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ ప్లాంట్లలో ఎఫ్‌జీడీ ప్లాంట్ అవసరమైతే కేంద్ర పర్యావరణ శాఖ ఎందుకు అప్పుడే సూచించలేదనేది అంతుబట్టని ప్రశ్న.