భద్రాద్రి రామాలయంలో ప్రాంగణంలో ఏర్పాటు చేయాలనుకున్న కవచాల పనులు ఆలస్యమవుతున్నాయి. వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ కు అధికారులు సూచించినా పురోగతి ఉండడంలేదు. ఈ అంశంపై దృష్టి సారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రామాలయ ప్రాంగణంలో ఆలయానికి సంబంధించిన పనులతో పాటూ ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పనులు కూడా చేస్తున్నట్లు తేలింది. ఈ విషయాన్ని అధికారులు సైతం నిర్ధారించారు. సదరు పనులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. అంతేకాక ప్రైవేట్ పనులు ఎందుకు జరుగుతున్నాయో, ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారో తేల్చేందుకు విచారణకు సైతం ఆదేశించారు. ఈ సంగతి పక్కనపెడితే రాయాలయంలో కవచాల పనులు సాగాల్సి ఉంది. అయితే ప్రధానమైన ఈ పనిని నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ పనులు చక్కబెట్టడంపై భక్తులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. శ్రీరాముడి పట్ల ఇంతటి నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కవచాల నిమిత్తం ఓ దాత రూ.20 లక్షలకుపైగా వెచ్చించేందుకు ముందుకొచ్చారు. ఈ మొత్తంతో పడమర వైపు ద్వారానికి ఇత్తడి కవచాలను అలంకరిస్తున్నారు. ఈ పనులు నిపుణుల పర్యవేక్షణలోనే సాగుతున్నాయి. అయితే పనులు కొన్ని నెలలుగా సాగుతుండం అనుమానాలకు తావిచ్చింది.
శ్రీరామనవమికి ముందే ఇత్తడి తాపడం పనులు పూర్తి కావాల్సి ఉన్నా అలా జరగలేదు. ఇప్పటికీ పనులు సాగిస్తుండడంతో కొందరు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా ఉన్నారన్న సందేహాలు బలపడ్డాయి. నెలల తరబడి పనులు సాగుతున్న తీరుని కనిపెట్టి విచారిస్తే ప్రైవేట్ పనులు సాగుతున్న తంతు ఎప్పుడో బయటపడి ఉండేదని భక్తులు అంటున్నారు. పొరుగు రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు రామాలయంలో కవచాలు చేస్తున్న వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారమే కొన్ని కిరీటాలను తయారు చేసినట్లు సమాచారం. భద్రాచలంలో కూడా మరో ఆలయంలో ఆంజనేయస్వామి కవచాలను ఏర్పాటు చేసేందుకు ఇక్కడ పనులు చేపట్టారు. ఎటపాకకు చెందినవారు కూడా ఇక్కడి పనివారితోనే అమ్మవారి కవచాలను తయారు చేయించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా తయారు చేసిన కవచాల కోసం ఆలయానికి రాయితీపై వచ్చే గ్యాస్‌ను వినియోగించారని అంటున్నారు. ఇదిలాఉంటే ప్రైవేట్ పనులు ఇలా సాగుతున్నా భద్రతాసిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. భక్తులను కలవరపరుస్తోంది. ఆలయన భద్రత కోసం భారీ యంత్రాంగం ఉంది. సీసీ కెమెరా వ్యవస్థ కూడా ఉంది. అయినప్పటికీ రామాలయానికి సంబంధం లేని వస్తువుల్ని ఇక్కడ ఎలా తయారు చేయగలిగారని అంతా ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో ప్రైవేట్ పనులు సాగించి ప్రధాన పనులను నిర్లక్ష్యం చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఉన్నతాధికారులనుఅంతా కోరుతున్నారు.