YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

టేకు చెట్లే టార్గెట్

టేకు చెట్లే టార్గెట్

కరీంనగర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో పర్యావరణ విధ్వంసం సాగుతోంది. కొందరు చెట్లను యథేచ్ఛగా నరికేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అటవీప్రాంతాన్ని కబ్జా చేస్తున్నారు. ఈ అక్రమాలపై అధికారులు ఉదాసీనంగా ఉండడంతో సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. అధికారయంత్రాంగం పర్యవేక్షణ కొరవడడం వల్లే ఇటీవలిగా కొందరు అక్రమార్కులు టేకు చెట్లను టార్గెట్ చేశారు. అడవిలో టేకు వృక్షాలను ఇష్టారాజ్యంగా నరికేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం హరితహారం పేరుతో చెట్లను పెంచేందుకు భారీ కార్యక్రమాలు అమలు చేస్తుంటే.. అధికార యంత్రాంగంలోని ఉదాసీనత ఉన్న చెట్లను కాపాడుకోలేని దుస్థితికి దారితీసిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. కరీంనగర్ మల్యాల మండలం పరిధిలో టేకు చెట్ల నరికివేత విపరీతంగా ఉంది. టేకుతో పాటూ ఇతర భారీ వృక్షాలనూ నేలకూల్చుతూ అక్రమంగా ఆర్జించుకుంటున్నారు పలువురు. అటవీ ప్రాంతంలో సమర్ధవంతంగానే పర్యవేక్షణ నిర్వహిస్తున్నామని సంబంధిత అధికారులు చెప్తున్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. చెట్ల నరికివేత యథేచ్ఛగా సాగిపోతోందని అంతా అంటున్నారు.

 

అటవీ అధికారుల నిఘా సమర్ధవంతంగా లేకపోవడంతో మల్యాల, కొండగట్టు గుట్ట, డబ్బుతిమ్మయపల్లెల్లోనే కాక ఇతర అటవీ ప్రాంతాల్లోనూ చెట్ల  నరికివేత సాగిపోతున్నట్లు ప్రజలు అంటున్నారు. చెట్లు కూల్చేసి వాటిని అక్రమంగా తరలించుకుపోతున్నారని చెప్తున్నారు. డబ్బుతిమ్మయపల్లె శివారులో అటవీ ప్రాంతంలో చేతిపంపు నిర్మించారు. ఇక్కడ నరికిన టేకు దుంగలున్నా పట్టించుకునే వారు లేరని సమాచారం. మల్యాల శివారులోని గుట్టల నుంచి నిత్యం కలపను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు అటువైపు వెళ్లడంలేదని పలువురు చెప్తున్నారు. అక్రమార్కులు ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేయడంతో అటవీ ప్రాంతంమైదానంగా మారుతోందని వాపోతున్నారు. కలప స్మగ్లర్లు గుట్టలపైకి ట్రాక్టర్లతో చేరుకోవడానికి ఏకంగా రహదారులు ఏర్పాటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. అక్రమార్కుల ఆగడడాలు మితిమీరిపోవడంతో వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది. అటవీ జంతువులు వేటగాళ్ల బారినపడుతూ ప్రాణాలు కోల్పోతున్నాయి. అటవీ ప్రాంతంలో ఇంతటి భారీ విధ్వంసానికి అధికారుల పర్యవేక్షణ కొరవడడమే అని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారయంత్రాంగం స్పందించి ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడాలని విజ్ఞప్తిచేస్తున్నారు.  

Related Posts