YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

నాకు పాఠాలు నేర్పిస్తున్నారా... మోడీ ప్రశ్న

నాకు పాఠాలు నేర్పిస్తున్నారా... మోడీ ప్రశ్న

న్యూఢిల్లీ, డిసెంబర్ 26 
జమ్మూ కశ్మీర్‌ కోసం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఢిల్లీ వేదికగా కొందరు ప్రతి రోజూ తనకు ‘ప్రజాస్వామ్య పాఠాలు’ బోధించడానికి ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా రాహుల్‌కు చురకలంటించారు. ప్రతిరోజూ తనను విమర్శిస్తున్నవాళ్లు జమ్మూ కశ్మీర్‌ను చూసి నేర్చుకోవాలని హితవుపలికారు. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికల జరగ్గా.. బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించిన విషయం తెలిసిందే.ప్రజాస్వామ్యం ఎంత బలమైందో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయని, ఢిల్లీ వేదికగా రోజూ నన్ను అవమానించాలని, నాకు ప్రజాస్వామ్య పాఠాలు చెప్పాలని చూస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు. వారి కపటత్వం, పవిత్రతను ఓ సారి చూడండని, సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా పాండిచ్చేరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేదని పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్‌ను ప్రకటించగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించామని అన్నారు. అక్కడ ఎన్నికల జరిగిన తీరును ఓసారి చూడాలని నేను కోరుతున్నానని, ప్రజాస్వామ్యానికి ఆ ఎన్నికలు ఓ ఉదాహరణ అని పరోక్షంగా రాహుల్ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్ ఇచ్చారు.దేశ అభివృద్ధితో చేయి చేయి కలుపుతూ ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌ కూడా వృద్ధి పథంలో పయనిస్తోందని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి వేళ కూడా జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి అత్యంత ప్రశంసనీయమైందని కొనియాడారు. జమ్మూ కశ్మీర్ చరిత్రలో ఇదో చారిత్రాత్మక రోజుగా అభివర్ణించిన మోదీ.. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి ఒక్కరూ లాభపడతారని పునరుద్ఘాటించారు. గాంధీ మహాత్ముడి కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని జమ్మూ కశ్మీర్ ప్రజలు సాధించారని ప్రశంసించారు.అధిక సంఖ్యలో ఓటింగ్ కేంద్రాలకు తరలివచ్చి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. గతంలో ఓ పార్టీతో పొత్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశామని, ఆ తర్వాత పొత్తు విచ్ఛిన్నమైందని పరోక్షంగా పీడీపీతో చెలిమిని మోదీ ప్రస్తావించారు. ప్రజలందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొని, నచ్చిన వారిని ఎన్నుకోవాలన్నదే తమ తాపత్రయంగా ఉండేదని వివరణ ఇచ్చారు.

Related Posts