రాజమండ్రి, డిసెంబర్ 26
పల్లెటూళ్లలో ఇల్లంటే..? పాతికేళ్ల క్రితం వరకూ గడ్డిపాకలు, పూరి గుడిసెలు. కానీ వాటి స్థానంలో మెల్లగా పెంకుటిల్లులు వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా డాబాలు, మిద్దెలు వాటి స్థానాన్ని ఆక్రమించాయి. ఇప్పుడు ఏ ఊరు వెళ్లి చూసినా ఎక్కువగా డాబాలే కనిపిస్తున్నాయి. పల్లె ప్రజలు హంగు ఆర్భాటాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వరు. తలదాచుకోవడానికి ఓ గూడు ఉంటే చాలని భావిస్తారు. అందుకే రెండు లేదా నాలుగు గదుల ఇళ్లు ఎక్కువగా కనిపిస్తాయి.కానీ కాలం మారింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆదాయం పెరిగింది. వ్యవసాయంతోపాటు వ్యాపారాలు చేస్తున్నారు. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన కొందరు సొంతూళ్లో తమ స్థాయికి తగ్గట్టుగా ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నారు. దీంతో భారీ భవంతులు సైతం గ్రామాల్లో దర్శనం ఇస్తున్నాయి. వీటి విలువ మహా అయితే 1-2 రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుంది.కానీ తూర్పుగోదావరి జిల్లా బలభద్రాపురంలో రూ.40 కోట్లతో ఓ ఇంద్రభవనాన్ని నిర్మించారట. బిక్కవోలు మండలంలోని ఈ గ్రామం మామూలు పల్లెటూరు కంటే పెద్దదే. అలాంటి చోట్ల బహుళ అంతస్థుల భవనాలు సాధారణమే. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇంటి వీడియో చూస్తే మాత్రం మతిపోవాల్సిందే.ఇంటి ముందు ఓ స్విమ్మింగ్ పూల్.. చూడగానే కట్టిపడేసే ఇంటీరియర్ డెకరేషన్.. మినీ థియేటర్‌తో.. ఫైవ్ స్టార్ హోటల్ సైతం చిన్నబోయేలా ఈ ఇంటిని నిర్మించారు. ఇల్లా.. ఇంధ్రభవనమా అనే రేంజ్‌లో ఉన్న ఈ ఇంటి విలువ రూ.40 కోట్లు ఉంటుందో ఉండదో చెప్పలేం గానీ.. ఇంటిని చూస్తే మాత్రం వావ్ అనాల్సిందే. ఈ ఇంట్లో చిరంజీవి, మహేశ్ బాబు ఫొటోలను ఉంచడం విశేషం