చాంద్రమాన మాసానికి 30 దినాలు. శుక్లపక్ష పాడ్యమి నుండి పౌర్ణమిదాకా గల శుక్లపక్షంలోని పదకొండవరోజు శుక్లపక్ష ఏకాదశి అని ; పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నుండి అమావాస్య వరకు గల 15 రోజులను బహుళపక్షమని లేక కృష్ణ పక్షమని, అందులోని పదకొండవ రోజు కృష్ణ పక్ష ఏకాదశి అని పిలవబడుతున్నది. కొన్ని సంవత్సరాలలో 24 పక్షాలకు పైన కొన్ని రోజులు మిగిలిపోతాయి. అందువలన 25 ఏకాదశులు వస్తాయి. పద్మపురాణం ఉత్తరా కాండలో యీ 25 కి విడివిడిగా పేర్లు దానివలన పుణ్యఫలాలు పొందిన వారి చరిత్రలు వున్నాయి.
ఏకాదశి చరిత్ర:
మురుడు అనే రాక్షసుడు దేవతలని, మరియు మానవులను హింసించేవాడు. ఆ దానవుని సంహంరించి తమను కాపాడమని అందరూ పరమశివుని వేడుకున్నారు. ఈశ్వరుడు వారిని మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకొనమని చెప్పాడు. అందరూ మహావిష్ణువుని శరణుకోరుకున్నారు. నమ్మినవారి చేయి వదలక కాపాడే నారాయణుడు ఆ మురునితో వేయి సంవత్సరాలు యుధ్ధం చేసి అలసిపోయాడు. బదరికాశ్రమంలో వున్న ఒక గుహలో విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయాన్ని ఆసరాగా చేసుకొని మురుడు మహావిష్ణువు ని చంపడానికి వచ్చినప్పుడు మహావిష్ణువు దేహం నుండి ఒక దివ్యశక్తి స్త్రీ రూపంలో బయటికి వచ్చింది . అసురుడు మహావిష్ణువు వద్దకి రాగానే ఆ స్త్రీ చేసిన ఓంకార నాదమే ఆ దానవుని దహించింది. తరువాత , మేలుకొన్న మహావిష్ణు ఆ శక్తి కి ఏకాదశి అని పేరు పెట్టి , ఏకాదశి వ్రతం చేసి, పూజించిన వారికి నేను సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తానని వరం అనుగ్రహించి , తనశక్తిని తాను తిరిగి తీసుకున్నాడు. నారాయణుని అనుగ్రహం పొందిన ఏకాదశి నాడు మనం జాగరణ చేసి వ్రతం ఆచరిస్తే మహావిష్ణువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది.
ముక్కోటి ఏకాదశి:
రావణాసురుని హింసలు భరించలేని దేవతలు బ్రహ్మదేవునితో కలసి వైకుంఠం వెళ్ళి మార్గశిరమాస శుక్లపక్ష ఏకాదశినాడు నారాయణుని ప్రార్ధించి తమ కష్టాలు చెప్పుకున్నారు. నారాయణుడు వారికి అభయమిచ్చి కాపాడినందువలన, ముక్కోటిదేవతల బాధలు తీరినందున వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని కూడా పిలువబడుతున్నది.
ఏకాదశి వ్రత ఫలం:
దేవతలు, దానవులు అమృతం కోసం రాత్రిం పగళ్ళు ఉపవసించి పాలకడలిని చిలకగా అమృతము వెలువడింది. ద్వాదశినాడు మహాలక్ష్మి సాగరము నుండి ఆవిర్భవించింది. ఆనాటి నుండి ఏకాదశినాడు పగలు రాత్రి ,దీక్షతో ఉపవాసం, జాగరణలు చేసి నారాయణుని స్తుతించిన వారికి యీ జన్మలోనే కీర్తి, ప్రతిష్టలు , సౌభాగ్యాలు అనుగ్రహించి మరోజన్మలేని వైకుంఠవాసాన్ని కటాక్షిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. మార్గశిరమాసం లోని శుక్లపక్ష 'మోక్ష ఏకాదశి' నే వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటున్నాము. ఏకాదశి వ్రతం ఆచరించడం వలన దేహారోగ్యం మనోబలం అభివృద్ధి చెందుతాయి.
వైకుంఠ ఏకాదశి ఏర్పడిన విధం:
వైష్ణవ ఆగమాలు మార్గశిరమాస శుక్లపక్ష ఏకాదశినాడు వేదాలలో, పురాణేతిహాసాలలో వేదాంగాలలో ,దేవతల ఋషులు ఉపదేశించినవిధంగా , ఆళ్వారు ఆచార్యులు ప్రబంధాలలో స్తుతించిన విధంగా మహావిష్ణువుని స్తుతించి పూజిస్తే ఆ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. ఇహలోకంలోనే ముక్తిని పొందేందుకు శ్రీవైష్ణ్వాలయాలలో వైకుంఠ ఏకాదశినాడు వైభవంగా ఉత్సవాలు , ప్రత్యేక పూజలు జరుగుతాయి.