ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్ష మద్దతుగా శ్రీ కాళహస్తి పట్టణంలో రెండు వర్గాలుగా దీక్షకు మద్దతు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు, పెండ్లిమండపం వద్ద మాజీ మంత్రి బోజ్జలగోపాలకృష్ణ రెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ ధర్మపోరాట దీక్ష చేపట్టారు. వైయస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గా గెలిచిన ఎస్సివి నాయుడు, రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు సమక్షంలో మళ్ళీ టిడిపి తీర్థం పుచ్చుకుని, బొజ్జల గెలుపు కోసం కృషి చేశారు. కానీ బొజ్జలతో ఆంటీఅంటనట్లు వ్యవహరిస్తూ, పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రజలకు చేరువుగా ఉన్నారు. అనారోగ్య రీత్యా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్ని కార్యక్రమాలలో పాల్గొనకపోయిన ఆయన సతీమణి బృందమ్మ, తనయుడు బొజ్జల సుధీర్ ప్రభుత్వ కార్యక్రమలకు సైతం హాజరౌతున్నారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం చేపట్టిన ధర్మపోరాట దీక్ష రెండు చోట్ల నిర్వహించారు. వారికి అభిమానులు, టిడిపి కార్యకర్తలు, కౌన్సిలర్లు, ఎంపిటిసిలు భారీ సంఖ్యలో సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ కు పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని, ఇప్పుడు కల్లబొల్లి మాటలు చూపుతున్నారని ప్రధాని తీవ్ర స్థాయిలో విమర్శించారు. విభజన చట్టంలో రూపొందిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, వచ్చే ఎన్నికలలో ప్రజలు సరైన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని అశాస్ట్రీయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ గెలిస్తే, ప్రత్యేక హోదా ఇస్తామనడం విచిత్తంగా ఉందని అన్నారు.