హైదరాబాద్, డిసెంబర్ 28,
కంటోన్మెంట్‌కు చెందిన అమ్మాయి, అబ్బాయి ఫేస్‌బుక్‌లో స్నేహితులుగా మారారు. ఆ పరిచయం ప్రేమగా మారగా.. ఆ అమ్మాయి తన ఫొటోలను అబ్బాయికి పంపింది.. ఇదే అలుసుగా తీసుకొని బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. డబ్బులు గుంజుతూ జల్సాలు మొదలు పెట్టాడు. అతడి వికృత చేష్టలకు విసిగిపోయిన ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాశ్చాత్య పోకడలకు వేదికగా మారుతున్న నగరంలో ఇలాంటి వికృత చేష్టలు పెరిగిపోతున్నాయి. ఎంతోమంది జీవితాలు నాశనమవుతున్నాయి. కొందరు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయిస్తుంటే.. మరికొందరు తమ బాధను ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. తనువును చాలిస్తున్నారు. తిరుమలగిరికి చెందిన మహిళతో చనువు పెంచుకున్న ఓ వ్యక్తి ఆమె నగ్న చిత్రాలను తీసుకొని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. రూ.10 లక్షలు ఇవ్వాలని పట్టుబట్టాడు. లేదంటే సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో దిక్కుతోచని ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఏడాది క్రితం జరిగిన ఈ ఘటన నగరంలో చర్చనీయాంశమైంది. సికింద్రాబాద్‌కు చెందిన మల్లేశ్, అమెరికాలో ఉంటున్న భారత సంతతికి చెందిన బాలికతో ఇన్‌స్టాగ్రాంలో పరిచయం ఏర్పరచుకున్నాడు. తెలుగు వ్యక్తి కావడంతో ఆమె అతడితో చాట్ చేసేది. మాయమాటలతో ఆమె నగ్న చిత్రాలను సేకరించిన మల్లేష్, మరిన్ని నగ్న వీడియోలు పంపాలంటూ వేధించసాగాడు. లేదంటే ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్నేహితులందరికీ ఫొటోలను పంపుతానని బెదిరించాడు. అతడిని బ్లాక్ చేసి, ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఇక్కడ ఉన్న బంధువుల ద్వారా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్‌కు చెందిన ఓ యువతి హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేది. అక్కడ ఆమెకు సురేశ్ అనే వ్యక్తితో స్నేహం కుదిరింది. అయితే యువతి స్పృహలో లేని సమయంలో సురేష్ ఆమె నగ్న చిత్రాలను తీశాడు. ఆ విషయం ఆమెకు తెలియకుండా స్నేహం నటిస్తూ వచ్చాడు. రెండు నెలల తర్వాత ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని చెప్పాడు. నాకు అలాంటి ఉద్దేశం లేదని.. త్వరలో బంధువుల యువకుడిని వివాహం చేసుకోబోతున్నానని ఆమె తెలుపడంతో పగ పెంచుకున్నాడు. ఆమె నగ్న చిత్రాలను యువతికి కాబోయే భర్తకు పంపడంతో పాటు సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశాడు. దీంతో తీవ్ర వేదనకు గురైన బాధితురాలు సైబరాబాద్ షీ-టీమ్స్‌ను ఆశ్రయించింది. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి ఆట కట్టించారు.అమ్మాయిల తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. తమ కూతురు ఎవరితో స్నేహం చేస్తోంది. ఫోన్‌లో మాట్లాడుతున్న తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారితో స్నేహంగా ఉంటూ అన్ని విషయాలను తెలుసుకోవాలి. బాధపడుతూ ఉంటే అందుకు గల కారణాలను అన్వేషించాలి. ఏది మంచి, ఏది చెడో విడమరిచి చెప్పాలి. మనోైస్థెర్యం కల్పిస్తూ..ఎవరితో ఎలా ఉండాలనే విషయాలను అర్థమయ్యేలా వివరించాలి. స్నేహంగా ఉండే సమయంలో అంతా బాగానే ఉంటుంది, ఎప్పుడైతే వారి మధ్య విబేధాలు, అనుమానాలు తలెత్తుతాయో అప్పుడే జ్ఞాపకాల కోసం తీసుకున్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్ మొదలవుతుంది. ఎంత స్నేహం ఉన్నా వ్యక్తిగతంగా ఫొటోలు దిగడం, వీడియోలు తీసుకోవడం చేయవద్దు.ఇది మంచిపరిణామం కాదు. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఇదే వారికి శ్రీరామ రక్షగా నిలుస్తుంది. -కేవీఎం ప్రసాద్, సైబర్‌క్రైమ్స్ ఏసీపీ బంధాలు, పరిచయాలు, ప్రేమలను ఫోన్‌లో భద్రపరుచుకుంటున్న కొందరు వాటితో బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నారు. భాగస్వామితో బంధం తెగిపోతుందని తెలియగానే కొందరు లీక్ చేస్తున్నారు. మరికొందరు బెదిరింపులకు దిగుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇందులో విద్యావంతులతో పాటు నిరక్షరాస్యులు ఉంటున్నారు.