YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గుర్రుగా అవంతి

గుర్రుగా అవంతి

విశాఖపట్టణం, డిసెంబర్ 30, 
అవంతి శ్రీనివాస్. ప్రస్తుతం వైసీపీ మంత్రి. అంతకు ముందు ఆయన టీడీపీలో ఎంపీ, దానికంటే ముందు ప్రజారాజ్యం తరఫున తొలిసారి నెగ్గిన ఎమ్మెల్యే. ఇక పూర్వాశ్రమంలో విద్యాసంస్థల అధినేత. ఇలాగే అవంతి గురించి చెప్పుకుంటే బయటకు కనిపించేవి. ఇక ఆయన బాహ్య రూపం చూస్తే ఎపుడూ నుదిటి పైన ఎర్రటి బొట్టు కనిపిస్తుంది. అంతే కాదు ఆయన చాలా సాత్వికంగా కనిపిస్తారు. కోపం వస్తే తప్ప ఆయన నెమ్మదిగానే ఎపుడూ ఉంటారు. సంస్కారంగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. ఇదంతా ఎందుకు అంటే అవంతి శ్రీనివాస్ జనానికి ఇప్పటిదాకా కనిపించిన తీరు అని చెప్పడానికే.  అవంతి శ్రీనివాస్ లోని రెండవ వైపు చూడాలనుకుంటే చాలా కష్టమేనని తాజాగా ఆయన మాటల బట్టే తెలుస్తోంది. తనకు ఉన్న ఆలోచనలు, చిన్నప్పటి లక్ష్యాలు వంటివి తాజాగా భీమిలీలో జరిగిన ఒక సభలో అవంతి శ్రీనివాస్ జనం ముందు పెట్టారు. అపుడు ఆయన చెప్పిన మాట తాను నక్సలైట్ కావాలన్నది. ఇది విన్న వారి గుండెలు గుభేల్ మన్నాయి కానీ అది నిజం అంటున్నారు అవంతి శ్రీనివాస్. తాను పెద్ద అయితే నక్సలైట్ కావాలనుకున్నాను అని మంత్రి నోటి వెంట ఈ మాటలు రాగానే పక్కన ఉన్న వైసీపీ నేతలతో సహా అంతా ఆశ్చర్యపోయారు. రాజ్యాంగబద్ధమైన మంత్రి పదవిలో ఉండి ఆయన అలా కోరిక వెళ్లబుచ్చడం పట్ల షాక్ కూడా తిన్నారు.సమాజంలో అసమానతలు, భూములు పేదలకు లేకపోవడం, నీటికి గూడుకు కూడా బీద జనాలు ఇబ్బంది పడడంతో అవంతి శ్రీనివాస్ సమ సమాజం కోసం నక్సలైట్ కావాలని ఒకప్పుడు అంటే యువకుడుగా ఉన్నపుడు తలపోశారట. కానీ ఆయన కోరుకున్న సమాజం ఇన్నేళ్ళకు ఆవిష్కరించబడిందట. జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వడం, రైతులకు సమగ్ర భూ సర్వే ద్వారా భూములపైన శాశ్వత హక్కులు కలుగచేయడం, అలాగే సాగునీటి ప్రాజెక్టుల ద్వారా జలాలను అందించే కార్యక్రమాలు చేయడం తో ఒక మంత్రిగా తాను ఎక్కువగా సంతోషపడుతున్నాని అని అవంతి శ్రీనివాస్ అంటున్నారు.అవంతి శ్రీనివాస్ లో నక్సలైట్ భావాలు ఎన్ని పాళ్ళు అన్నది పక్కన పెడితే ఆయనలో కూడా ఒక రెబెల్ ఉన్నాడు అన్నది 2019 ఎన్నికల వేళ బయటపడింది. ఆయన తన రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావు మీదనే తిరుగుబాటు జెండా ఎగరేసి తనకూ మంత్రి కావాలని ఉంది అంటూ తన సమాన వాటాను అలా వైసీపీలోకి దక్కించుకున్నారు. ఇక కోపం ఒక్కటే అవంతిలో మైనస్ పాయింట్ అని కూడా చెబుతారు. ఆయన కోపంలో గట్టిగానే మాట్లాడేస్తారు. అయితే ఆయన సహాయం చేసే విషయాల్లో పది మందికి ఉపయోగపడే వాటిలో మాత్రం ముందుంటారు. ఇక పన్నెండేళ్ల రాజకీయ జీవితంలో అవంతి శ్రీనివాస్ మీద అవినీతి మచ్చ పడలేదు. మొత్తానికి నక్సలైట్ సిద్ధాంతాలు అన్నీ కూడా సాధారణ జీవితంలో అనుసరిస్తూ మంచి నాయకుడిగా ఉన్న అవంతి జన నాయకుడిగా జేజేలు అందుకుంటున్నారు. అందువల్ల ఆయనలోని రెండవ కోణం ఎప్పటికీ అవసరం లేదేమో

Related Posts