కడప, డిసెంబర్ 30,
ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు. తన నియోజకవర్గం పరిధిలో అందరితో శతృత్వం పెంచుకుంటున్నారు. ఇది అధిష్టానం దృష్టికి వెళ్లినా పెద్దగా లెక్క చేయడం లేదు. జమ్మల మడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి శత్రువులు పెరుగుతున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయిన పదిహేడు నెలల్లోనే లెక్కకు మించి శత్రువులను ఆయన తయారు చేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వయంకృతాపరాధమేనంటున్నారు.జమ్మలమడుగు నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి కంచుకోట వంటిది. 2014 ఎన్నికల్లోనూ ఆదినారాయణరెడ్డి వైసీపీ గుర్తు మీదే గెలిచారు. ఆయన టీడీపీ లోకి వెళ్లడంతో సుధీర్ రెడ్డికి పార్టీ టిక్కెట్ ఇచ్చింది. వైద్యుడిగా మంచి పేరు ఉండటం ఈయనకు కలసి వచ్చింది. సుధీర్ రెడ్డి విజయానకి హత్యకు గురైన వివేకానందరెడ్డితో పాటు ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి విశేషంగా కృషి చేశారు. వైఎస్ కుటుంబానికి నియోజకవర్గంలో ఎక్కువ మంది అభిమానులు ఉండటంతో సుధీర్ రెడ్డి గెలుపు సాధ్యమయింది.వైఎస్ జగన్ కు తాను వీరవిధేయుడినని సుధీర్ రెడ్డి నిత్యం చెబుతుంటారు. అయితే ఆయన వ్యవహారశైలి మాత్రం పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన రామసుబ్బారెడ్డితో సుధీర్ రెడ్డికి పొసగడం లేదు. ఇటీవల హత్యలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తన సొంత జిల్లాలోని జమ్మలమడుగులో పార్టీలో తలెత్తిన అసమ్మతిని పారదోలేందుకు జగన్ అవినాష్ రెడ్డిని మధ్యవర్తిగా పంపినట్లు తెలిసింది. అయినా పెద్దగా ఫలితం కన్పించడం లేదు.ఇక సుధీర్ రెడ్డిపై తాజాగా వైసీపీ నేతలు తిరుగుబాటు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలకు నియోజకవర్గంలో ఏ పనీ జరగడం లేదని చెబుతున్నారు. తాము వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్నామని, సుధీర్ రెడ్డిని కాదని వారు వ్యతిరేక స్వరం విన్పించారు. ఇది జగన్ దృష్టికి తీసుకెళతామని చెబుతున్నారు. మొత్తం మీద సుధీర్ రెడ్డి వ్యవహారం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇంత తక్కువ కాలంలో అంత ఎక్కువ అసమ్మతిని ఎదుర్కొన్న ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి పేరు పార్టీలో హాట్ టాపిక్ అయింది.