తిరుపతి, డిసెంబర్ 30,
రాయలసీమలో ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వయొలెంట్ గా మారినట్లు కనిపిస్తూ ఉంది. ఇటీవలి కాలంలో అక్కడ చోటు చేసుకుంటున్న ఘటనలే అందుకు కారణం. తాడిపత్రిలో కూడా ఏదో ఫ్యాక్షన్ సినిమాలో ఘటనలా జేసీ వర్గం, ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గం మధ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక కడప జిల్లాలో టీడీపీ నాయకుడిని అతి దారుణంగా చంపేశారు. సీమ ఫ్యాక్షన్ మళ్లీ జూలు విదిలిస్తుందా అనేలా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. కడపజిల్లాలో టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య ప్రొద్దుటూరు సమీపంలో హత్య చేయబడ్డాడు. సోములవారిపల్లె పొలాల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ లేఅవుట్ దగ్గర సుబ్బయ్య మృతదేశం కనిపించింది. కళ్లల్లో కారం కొట్టి కత్తులతో నరికి చంపారు ప్రత్యర్థులు. ఈశ్వర్ రెడ్డి నగర్‌కు చెందిన నందం సుబ్బయ్య 2002 నుంచి ఏడేళ్ల పాటు ప్రొద్దుటూరు ప్రస్తుత ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. 2009లో రాచమల్లు వైసీపీలో చేరగా సుబ్బయ్య మాత్రం టీడీపీలోనే ఉండిపోయాడు. 2015 నుంచి కడపజిల్లా టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న సుబ్బయ్య ఇటీవల అధికార పక్షం ఎమ్మెల్యేతో పాటు ఆయన బావమరిది బంగారు రెడ్డి పై ఆరోపణలు చేస్తున్నారు. ఆయనను ప్రత్యర్థులు చంపేసి ఉంటారని చెబుతూ ఉన్నారుప్రొద్దుటూరులో ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యే బావమరిది హస్తం ఉందని ఆరోపిస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇళ్ల పట్టాల వ్యవహారంలో కూడా భారీ అవకతవకలు జరిగాయంటూ.. సోమవారం ప్రెస్‌మీట్ పెట్టగా.. మరుసటి రోజే హత్యకు గురవ్వడంతో అనుమానాలకు తావిస్తోంది. సుబ్బయ్య హత్య వెనుక ఎమ్మెల్య రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, అతని బావమరిది బంగారు మునిరెడ్డిల ప్రమేయం ఉందని.. మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఆరోపిస్తున్నారు. సుబ్బయ్యను చంపిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాయలసీమ చోటు చేసుకుంటున్న ఘటనలను చూస్తూ ఉంటే రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షన్ పడగ విప్పిందేమో అని పక్కాగా అనిపిస్తూ ఉంది. విమర్శలు చేస్తే ప్రాణాలే తీస్తారా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాయి బాధిత కుటుంబాలు. ఈ విష సంస్కృతి ఎప్పుడు అంతమవుతుందో చూడాలి.