విజయవాడ, డిసెంబర్ 30,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి. ముఖ్యంగా మంత్రుల విషయంలో చిన్న రిమార్క్ వచ్చినా కూడా సహించరు. అందుకే వైసీపీ నాయకుల్లో కొత్త టెన్షన్ పట్టుకుంది. వచ్చే ఏడాది తమ మంత్రి పదవి ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ప్రస్తుతం ఈ టెన్షన్ లోనే మంత్రులు ఉన్నారు. వీలైనంత త్వరగా అభివృద్ధి పనులు చేసి అటు ప్రజల్లోనూ.. ఇటు ముఖ్యమంత్రి వద్ద కూడా మంచి పేరు సంపాదించుకోవాలని అనుకుంటూ ఉన్నారు. ఏ నాయకుడిని కూడా అంత ఈజీగా పక్కన పెట్టే పరిస్థితి వైసీపీలో లేదు. గతంలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నాయకులకు అండగానే ఉన్నారు జగన్. రెండున్నరేళ్ల తరువాత తమ కేబినెట్‌లోని మంత్రులను తప్పించి కొత్తవారికి స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్ గతంలో ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి ముందే ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకు రావడం కూడా అప్పట్లో సంచలనం అయింది. రెండున్నరేళ్ల తరువాత మిగతా నాయకులకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని అన్నారు. అలాంటి నేతల ఆశలు నెరవేరే ఏడాది 2021 రానే వచ్చేస్తోంది. కొందరు నాయకులు తమకు అవకాశం వస్తుందని అనుకుంటూ ఉంటే.. మరికొందరు నాయకులు ఉన్న పదవి కూడా ఊడుతుందే అనే టెన్షన్ లో ఉన్నారు. 2021 నవంబర్ నాటికి ఏపీ మంత్రివర్గంలోకి కొత్తవాళ్లు రావాల్సి ఉంటుంది. ఈ విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరూ టెన్షన్ పడుతూ ఉన్నారు. ఒక అరడజను మంత్రులు మినహా మిగతా వారందరికీ స్థానచలనం ఉంటుందని ఇప్పుడే ప్రచారం మొదలైంది. వారి స్థానాల్లో తమకు అవకాశం ఉండొచ్చని పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. సామాజిక, ప్రాంతీయ లెక్కల ప్రకారం తామే నెక్స్ట్ మినిస్టర్స్ అని చెప్పుకుంటూ ఉన్నారు. ఆశావాహులను సంతృప్తిపరిచేందుకు జగన్ ఆ హామీ ఇచ్చారా అన్నది తెలియాల్సి ఉంది. అందరినీ సంతృప్తి పరచడం సీఎం జగన్‌కు కూడా సాధ్యంకాకపోవచ్చని కూడా అంటున్నారు.చూద్దాం 2021లో ఎలాంటి మార్పులు అధికార వైసీపీలో ఉంటాయో..