విజయవాడ, డిసెంబర్ 30,
అందరు నేతలను సంతృప్తి పర్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితుల నేపథ్యంలో ఎవరూ నొచ్చుకోకూడదన్న రీతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఎవరు పార్టీ నుంచి అసంతృప్తితో ఇప్పుడు వెళ్లిపోయినా పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అధికార పార్టీకి అడ్వాంటేజీగా మారుతుంది. అందుకే చంద్రబాబు వీలయినంత మందికి పనికి పదవి పథకాన్ని ప్రవేశపెట్టినట్లే కనపడుతుంది.ఇటీవల 23 లోక్ సభ నియోజకవర్గాలకు పార్లమెంటరీ ఇన్ ఛార్జులను చంద్రబాబు నియమించారు. వీరితో పాటు ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు కన్వీనర్లను నియమించారు. ఇక రాష్ట్ర కమిటీ,పొలిట్ బ్యూరో అయితే జంబో కమిటీలనే చెప్పాలి. దాదాపు క్రియాశీలకంగా ఉన్న నేతలందరికీ, సామాజికవర్గాల సమీకరణల ఆధారంగా చంద్రబాబు పదవులను భర్తీ చేశారు. ఎక్కువ మంది బీసీలకు ఛాన్స్ ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పారు.అయితే ఇంకా కొద్ది మంది కీలక నేతలు పదవులు లేకుండా మిగిలిపోయారు. కొందరికి పదవులు ఇచ్చినా వారికి పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించేందుకు వీలు లేకపోవడంతో మరొక కొత్త పదవులను చంద్రబాబు సృష్టించారు. ప్రతి ఐదు పార్లమెంటు స్థానాలను ఒక జోన్ గా విభజించారు. రాష్ట్రంలో ఐదు జోన్ లను ఏర్పాటు చేసి ఐదుగురు నేతలకు జోన్ ల బాధ్యతలను నిర్వహించారు. పార్లమెంటు నియోజకవర్గాలపై వీరి పర్యవేక్షణ ఉంటుందని చంద్రబాబు తెలిపారు.ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు పార్లమెంటు నియోజకవర్గాలను, పంచుమర్తి అనూరాధకు కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు నియోజకవర్గాలను, బత్యాల చెంగల్రాయుడికి విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల నియోజకవర్గాలను, అనగాని సత్యప్రసాద్ కు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గాలకు, మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డకి కడప, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకే ఈ పదవులను భర్తీ చేసినట్లు చంద్రబాబు చెప్పినా.. ఎవరూ అసంతృప్తికి లోను కాకూడదనే కొత్త పదవులను చంద్రబాబు సృష్టించుకుంటూ పోతున్నారని టీడీపీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.