తిరుమల, డిసెంబర్ 30,
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బాధ్యతగా ఉండాల్సిన ఆలయ ఉద్యోగులు ఏకంగా భక్తులకే శఠగోపం పెట్టారు. తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లోనే చేతివాటం చూపించారు. స్వామి వారి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే 1,100 కిలోల నెయ్యి మాయమైనట్లు దేవస్థానం అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణానికి సంబంధించి నలుగురు ఉద్యోగులపై ఆలయ ఈవో డి.భ్రమరాంబ చర్యలు చేపట్టారు. అలాగే ఆ ఘటనపై విచారణ జరిపే సమయంలో స్టాకులో పలు అవకతవకలను గుర్తించిన ఈవో.. మరో నలుగురు ఉద్యోగులకు తాజాగా, మెమోలను జారీచేశారు.వివరాల్లోకి వెళితే.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి ఉపయోగించే 1,100 కేజీల నెయ్యి మాయమైనట్లు ఈ ఏడాది జూలైలో దేవస్థానం అధికారులు గుర్తించారు. ఆ సమయంలో అంబరు ఖానా గుమస్తాగా పనిచేస్తున్న మద్దాల శ్రీనును దానికి బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారు. అలాగే అతడి నుంచి రూ. 5.30 లక్షలు రికవరీ చేశారు. రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తూ.. అప్పటి రీజినల్ జాయింట్ కమిషనర్, ప్రస్తుత శ్రీవారి దేవస్థానం ఈఓ భ్రమరాంబను విచారణాధికారిగా నియమించారు.దీనిపై అప్పట్లో విచారణ జరిపిన భ్రమరాంబ నివేదికను కమిషనర్‌కు అందజేశారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న మద్దాల శ్రీనుకు రెండు ఇంక్రిమెంట్లు కట్‌చేసి, విధుల్లోకి తీసుకుంటూ ఈవో భ్రమరాంబ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే ఘటనకు సంబంధించి ఓ ఏఈఓను, ఒక సూపరింటెండెంట్‌ను, అలాగే మరో గుమస్తాను బాధ్యులను చేస్తూ, వారికి ఒక్కో ఇంక్రిమెంట్‌ను కట్‌చేస్తూ ఆదేశాలిచ్చారు.ఇక, నెయ్యి కుంభకోణం ఘటనపై విచారణ జరిపిన సమయంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈఓ భ్రమరాంబ విచారణ జరుపుతుండగా, అంబరుఖానాలోని స్టాకులో పలు అవకతవకలను గుర్తించినట్లు సమాచారం. దీనికి ఒక ఏఈఓను, ఒక సూపరింటెండెంట్‌ను, ఇద్దరు గుమస్తాలను బాధ్యులను చేస్తూ, ఏడు రోజుల్లో వివరణ కోరుతూ వారికి మెమోలను జారీచేశారు. అలాగే చైతన్యజ్యోతి వెల్ఫేర్ సొసైటీకి నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన ఏఈఓకు ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ షాపు లీజు విషయంలో జరిగిన అవకతవకలపై విచారణాధికారిగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వైకుంఠరావును నియమించారు