YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వాటర్ వేస్ దిశగా పోలవరం అడుగులు

వాటర్ వేస్ దిశగా పోలవరం అడుగులు

డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, పరిశ్రమల  నీటి అవసరాలు తీర్చడం, జల విద్యుదుత్పత్తితోపాటు జల రవాణాకు పోలవరం ప్రాజెక్టు కీలకం కానుంది. వాటర్ వేస్ ఆధారిటీ పోలవరం జల రవాణాకు అనుసంధానంగా డిజైన్లు చేసింది. ధవళేశ్వరం నుంచి భద్రాచలం వరకు 171 కిలో మీటర్ల పొడవునా, నల్లగొండ జిల్లా వజీరాబాద్ నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజి వరకువున్న 157 కిలో మీటర్ల జల మార్గాన్ని కార్గో బోట్లు పెరిగే విధంగా ఆధునికీకరిస్తారు. గుంటూరు, నల్లగొండ జిల్లాల్లో విస్తారంగా లభించే సిమెంటు, సున్నపురాయి, పొగాకు, మిర్చి, పత్తి ఉత్పత్తులతో పాటు కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల్లోని బొగ్గు, పేపర్‌మిల్స్ ఉత్పత్తులను, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఓడ రేవులకు చేర్చే విధంగా నదీ మార్గాన జల రవాణా ఏర్పాటుచేస్తారుకాకినాడ-పుదుచ్ఛేరి జల రవాణాకు కాల్వ నిర్మాణం ఈ బృహత్ ప్రాజెక్టులో భాగం. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నాలుగవ జల రవాణా మార్గానికి ఉపయోగపడేలా పోలవరం కాలువలను డిజైన్ చేశారు. పోలవరం ప్రాజెక్టులో పోర్టులు, రాజధాని అమరావతి, నదుల అనుసంధానం కూడా కలవనుంది అందుకే పోలవరం బహుళ ప్రయోజనాలలో జల రవాణా కీలకం కానుంది. గోదావరి నదిలో రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వరకు జరిగే సరుకుల రవాణా, విహార యాత్ర మార్గంగా గోదావరి నదిని ప్రస్తుతం వినియోగిస్తున్నారు. అయితే పోలవరం జలాశయ ఆనకట్టవల్ల ఈ రవాణా మార్గానికి ఆటంకం కాకుండా ఒక ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జలాశయం ఎగువ నుంచి దిగువకు, దిగువ నుంచి ఎగువకు సరుకుల రవాణాకు జలాశయం ఎడమవైపున తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని పురుషోత్తపట్నం గ్రామం వద్ద జల రవాణా ప్రయాణాలకు అనువుగా ప్రత్యేక కాలువ నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో కాకినాడ నుంచి పుదుచ్ఛేరి వరకు ఏర్పాటు చేయతలపెట్టిన నాల్గవ జాతీయ జల రవాణా మార్గానికి అనుసంధానం చేసి, అటు భద్రాచలం వరకు దీనిని అనుసంధానం చేయనున్నారు. కాకినాడ-పుదుచ్చేరి జల రవాణా కాల్వ ఈ బృహుత్ ప్రాజెక్టులో భాగం. దీనికి కొనసాగింపుగా బకింగ్‌హామ్ కాల్వ లోతు, వెడల్పు పెంచే పథకం. ఇందులో దేశీయ, విదేశీ బహుళజాతి కంపెనీలకు చేతినిండా పని కల్పించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. సర్వకాలాల్లో పోలవరం జలాశయంలో నిల్వవుండే 75 టిఎంసిల నీటిలో 60 టిఎంసిలు వ్యవసాయ అవసరాలకు నిల్వవుంచితే మిగిలిన 17 టిఎంసిలు కాకినాడ-తడ కారిడార్‌లో స్థాపించే బహుళజాతి కంపెనీలు, వివిధ స్వదేశీ కంపెనీల నీటి అవసరాలను తీర్చడానికి వినియోగిస్తారు. ఈ స్థాయి నీటిని తీసుకెళ్ళే పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాల్వల్లో జల రవాణా ప్రాజెక్టుతో పోర్టులు, నదులు, రాజధాని అనుసంధానంగా ప్రాజెక్టు రూపకల్పనచేశారు. పోలవరం భారీ కాల్వల ద్వారా మరో ముఖ్యమైన జల రవాణా ఏమిటంటే గోదావరి లోయలోని బొగ్గు నిక్షేపాలను చెన్నై, పుదుచ్ఛేరి ప్రాంతంలోని పారిశ్రామిక సంస్థలకు అందించడం. కేజీ బేసిన్‌లోని చమురును సునాయాసంగా రవాణా చేసేందుకు వినియోగిస్తారు. పోలవరం నుంచి భద్రాచలం, పోలవరం నుంచి అమరావతి, అక్కడ నుంచి చెన్నై, పుదుచ్ఛేరి, ఇటు విశాఖ వరకు జల రవాణాకు అనుగుణంగా కుడి, ఎడమ కాల్వలను డిజైన్ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టులతో పాటు రాష్ట్రంలోని వివిధ పోర్టులతో ఈ కాల్వలకు అనుసంధానం ఏర్పడుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు బొగ్గు, స్టీలు, సిమెంట్, సున్నపురాయి ఎగుమతి చేస్తారు. అంతేకాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లోని చేపలు, రొయ్యలతో పాటు విశాఖ నుంచి ఉక్కు ఉత్పత్తులను రవాణా జరిగేలా వాటర్ వేస్ అధారిటీ డిజైన్ చేస్తుంది. 

Related Posts