ముంబై, డిసెంబర్ 30,
వెండితెరపై హీరోగా వెలిగిపోవాలని ఎన్నో ఆశలతో ముంబయిలో అడుగుపెట్టారు సోనూసూద్. అయితే హీరోలతో దెబ్బలు తినే విలన్ వేషాలే ఆయనకు స్వాగతం పలికాయి. అయినా నిరాశ పడకుండా బాలీవుడ్‌లోనే కాకుండా అనేక భాషల్లో విలన్ పాత్రలు వేస్తూ అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే సినిమాల్లో హీరో కాకపోయినా.. లాక్‌డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులు, నిరుపేదలకు ఆదుకుని నేషనల్ హీరో అంటూ అందరికీ ప్రశంసలు అందుకున్నారు.ఇన్నాళ్లూ ఆన్ స్క్రీన్‌పై కనిపించిన సోనూసూద్ నిర్మాతగా మారనున్నారట. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘నేను నిర్మాతగా మారుతున్నాను. ప్రజల్లో స్ఫూర్తి నింపే కథలు, నేను చేయాలనుకున్న స్క్రిప్ట్స్ కోసం అన్వేషిస్తున్నాను. అన్నీ కుదిరితే త్వరలోనే నిర్మాతగా మీ ముందుకొస్తా’ అని సోనూసూద్ అన్నారు.సోనూసూద్‌కి ప్రస్తుతం ప్రజల్లో ఉన్న క్రేజ్‌ని బట్టి ఆయనతో విలన్ వేషాలు వేయించేందుకు దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లోనూ నెగిటివ్ షేడ్స్ ఉండే ఆయన పాత్రకు కొన్ని మార్పులు చేశారట. చిరంజీవి సూచనల మేరకు దర్శకుడు ఆ మార్పులు చేసినట్లు ఇటీవలే సోనూసూద్ చెప్పుకొచ్చారు.
హ్యుమానిటేరియన్ అవార్డుకు సోనూ
ఈ ఏడాది అందరూ కరోనా వైరస్ వల్ల నానా ఇబ్బందులు పడితే హీరో సోనూసూద్ మరోలా ఇబ్బంది అనలేంగాని ఎనలేని గౌరవాలను దక్కించుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సత్కారాలు..సన్మానాలు..మరోపక్క గుళ్ళు..పూజలు..హారతులతో సోనూసూద్ ని తెగ గౌరవిస్తున్నారు పలువురు. ఎన్ని సత్కారాలు చేసినా తక్కువే అని చెప్పుకోవాలి సోనూసూద్ విషయంలో ఎందుకంటే ఆయన చేసే సత్కార్యాలు అలాంటివి మరి. అడిగినవారికి..అడగని వారికి కూడా తనవంతు సాయమందిస్తున్నాడీ హీరో. కరోనా వణికిస్తున్న వేళ.. తెరపై హీరోలంతా నిజ జీవితంలో మౌనంగా ఉంటే.. అదే తెరపై విలన్ మాత్రం రియల్ లైఫ్ లో నిజమైన హీరోగా ముందుకు కదిలాడు.సాయం కోసం అర్థించిన ప్రతీ చేతిని ఆప్యాయంగా అందుకున్నాడు. నేనున్నానంటూ అండగా నిలిచాడు సోనూసూద్. చేతికి ఎముకే లేదన్నట్టుగా సాగిన ఆ సహాయ పర్వం.. నిస్సహాయులందరికీ ఆపన్న హస్తమైంది. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశాడు సోనూ సూద్. సినిమాల్లో తను సంపాదించిందంతా ప్రజలకే ధారాదత్తం చేశాడు. చివరకు తన ఇల్లు కూడా తాకట్టు పెట్టాడని వార్తలు వచ్చాయి. తన త్యాగంతో.. సేవతో.. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు సోనూ. అయితే పళ్లున్న చెట్లకే రాళ్ల దెబ్బలన్నట్లు ఎందరికో ఆపద్భాందవుడిగా మారిన సోనూసూద్‌ని కూడా విమర్శించే వాళ్లున్నారు. ఈ క్రమంలోనే ఆయన చేసే సాయమంతా ఫేక్ అంటూ విమర్శించిన ఓ నెటిజన్‌ను సోనూసూద్ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారాయన.ఇప్పుడు సోనూసూద్ ఓ నేషనల్ ఐకాన్. అతనో రియల్ హీరో. ఇంత చేసిన సోనూకు ఎన్నో గౌరవాలు దక్కాయి. తాజాగా.. మరో అవార్డు ఆయనకు దక్కబోతోంది. ‘హ్యూమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్-2020’ అవార్డును సోనూసూద్ అందుకోబోతున్నారు. ప్రతిష్టాత్మక బాలీవుడ్ ఫెస్టివల్ నార్వే చేత ఈ గౌరవాన్ని పొందబోతున్నాడు ఈ హీరో. ఈ డిసెంబరు 30 న ఈ అవార్డును సోనుసూద్ కి అందజేయనున్నట్లు సమాచారం. ఇలాంటి ఎన్నో గౌరవాలకు సోనూసూద్ అర్హూడే అంటున్నారు ఆయన నుండి సాయం పొందిన వారు. పక్కనున్న మనిషినే పట్టించుకోని ఈ రోజుల్లో ముక్కు మొహం తెలియని వారికోసం ఇంతటి సాయం చేయడం విశేషమే కదా.