సిడ్ని, డిసెంబర్ 30,
అడిలైడ్ టెస్ట్‌లో దారుణంగా ఓడిపోయిన భారత్ ఇప్పుడు అందుకు తగ్గ ప్రతీకారం తీర్చుకుంది. ఆతిథ్య జట్టు ఆపసోపాలు పడ్డ పిచ్‌పై మన బౌలర్స్, బ్యాట్స్‌మెన్స్ అద్భుత ప్రతిభ కనబరిచి ఎనిమిది వికెట్ల తేడాతో రెండో టెస్ట్‌లో ఘన విజయం సాధించారు. ముఖ్యంగా భారత బౌలర్స్ బెబ్బులిలా విజృంభించి ఆస్ట్రేలియాని రెండు ఇన్నింగ్స్‌లలో 200 పరుగుల లోపే కట్టడి చేశారు. బంతులని రాకెట్‌లా విసరుతూ బుమ్రా, సిరాజ్‌లు ఆస్ట్రేలియాని గజగజ వణికిస్తే అశ్విన్, జడేజాలు తన మణికట్టు మాయాజాలంతో కంగారూలని కంగారెత్తించారు. రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ, శుభ్‌మన్ గిల్, రహానే, జడేజాల అద్భుత పోరాట పటిమతో తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేశారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా సరిగ్గా 200 పరుగులకు కుప్పకూలింది. ఆతిథ్య జట్టులో గ్రీన్ 45, వేడ్ 40, లబుషేన్ 28, కమిన్స్ 22 కాసేపు ప్రతిఘటించడంతో భారత్ విజయం కాస్త లేట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ 3, బుమ్రా, జడేజా, అశ్విన్‌కు తలో 2 వికెట్లు, ఉమేష్ ఒక వికెట్ తమ ఖాతాల్లో వేసుకున్నారు. 70 పరుగుల లక్ష్యంతో లంచ్ విరామం అనంతరం బ్యాటింగ్ చేపట్టిన టీ మిండియా ఆదిలో రెండు వికెట్లు వెంట వెంటనే కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5) పరుగులకు ఔట్ కాగా, పుజారా(3) పరుగులకు పెవీలియన్ బాట పట్టారు. తొలి టెస్ట్ ఆడుతున్న శుభ్‌మన్ గిల్(35) , స్టాండిన్ కెప్టెన్ రహానే(24)తో కలిసి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో సిరీస్ 1-1తో సమం అయింది. ఈ సిరీస్‌లో మరో టెస్ట్‌లు మిగిలి ఉండగా, ఎవరు ఆధిక్యం ప్రదర్శిస్తారో చూడాలి.
జయహో రహేనా
ఇండియన్ క్రికెట్‌లోనే కాదు.. ప్రపంచ క్రికెట్‌లో కొన్నేళ్లుగా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు విరాట్ కోహ్లి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఇండియన్ క్రికెట్‌పై ఆ స్థాయి ముద్ర వేసిన ప్లేయర్ విరాట్ మాత్రమే. అంతటి గొప్ప ప్లేయర్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాతో ఆడిన తొలి టెస్ట్‌లో టీమిండియా దారుణ పరాభవాన్ని మూట గట్టుకుంది. కేవలం 36 పరుగులకే కుప్పకూలి తన టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి తక్కువ స్కోరు నమోదు చేసింది. ఇది జరిగింది డిసెంబర్ 19న. అక్కడ కట్ చేయండి. డిసెంబర్ 29.. అదే ఆస్ట్రేలియా టీమ్‌పై, వాళ్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే బాక్సింగ్ డే టెస్ట్‌లో 8 వికెట్లతో మట్టి కరిపించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కేవలం పదంటే పది రోజుల్లోనే ఎంత మార్పు? ఈ చారిత్రక విజయం వెనుక ఉన్నది ఒక ఐదున్నర అడుగులు కూడా లేని ఓ బక్క పలచని వ్యక్తి. ఇప్పుడతడే ఇండియన్ క్రికెట్‌లో హీరో అయిపోయాడు. ఆ యోధుడి పేరు అజింక్య రహానే. తొలి టెస్ట్ అంత దారుణంగా ఓడిన తర్వాత టీమిండియా మళ్లీ పుంజుకుంటుందని ఎవరూ ఊహించలేదు. అసలే కళ్లెప్పుడూ నెత్తిన ఉండే ఆస్ట్రేలియా క్రికెట్ మాజీలైతే ఇక వైట్ వాష్ తప్పదనీ తేల్చేశారు. ఇది చాలదన్నట్లు కోహ్లి రిటర్న్ ఫ్లైటెక్కాడు. స్టార్ బౌలర్ మహ్మద్ షమి గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. టీమ్‌లో పెద్ద పేరున్న ప్లేయర్స్ ఎవరూ లేరు. ఇలాంటి సమయంలో రహానే టీమ్‌ను ముందుండి నడిపించిన తీరు అసామాన్యం. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను కేవలం 195 పరుగులకే కట్టడి చేయడం మ్యాచ్‌లో తొలి మలుపు. ఇందులో కెప్టెన్‌గా రహానే ఎత్తుగడలే కీలకపాత్ర పోషించాయి. బౌలర్లను అతడు వాడుకున్న తీరు, ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్ చూసి క్రికెట్ పండితులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్ భారాన్ని కూడా తన భుజాలపై మోశాడు. కోహ్లిలాంటి యోధుడు లేకపోయినా ఆ లోటు తెలియకుండా చేశాడు. ఓవైపు మిగతా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టినా ఫైటింగ్ సెంచరీతో టీమ్‌కు కీలకమైన 131 పరుగుల ఆధిక్యాన్ని అందించాడు. ఇందులో జడేజా పాత్రను కూడా తక్కువ చేయలేం. గాయం కారణంగా రెండు టీ20లు, తొలి టెస్ట్‌కు దూరమైన జడ్డూ.. వచ్చీ రాగానే అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో రహానేకు అండగా నిలిచాడు. ఇక తొలి టెస్ట్ ఆడుతున్న మన హైదరబాదీ సిరాజ్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ ఈ చారిత్రక విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. మ్యాచ్‌లో సిరాజ్ మొత్తం 5 వికెట్లు తీయగా.. గిల్ 80 పరుగులు చేశాడు. టీమ్‌కు ఈ చారిత్రక విజయం సాధించి పెట్టిన రహానే ఇప్పుడు ఇంటర్నెట్ హీరోగా అవతరించాడు. అభిమానులు ట్విటర్‌లో అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నువ్వొక నిజమైన పోరాట యోధుడివి అంటూ కీర్తిస్తున్నారు.