న్యూఢిల్లీ డిసెంబర్ 30
వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇండియా, చైనా మధ్య మిలిటరీ, దౌత్య స్థాయి చర్చలు అర్థవంతమైన పరిష్కారం ఇవ్వలేదని అన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ప్రస్తుతం తూర్పు లఢాక్‌లో పరిస్థితులు అలాగే ఉన్నాయని చెప్పారు. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున సరిహద్దులో బలగాలను ఉపసంహరించే అవకాశం లేదని కూడా రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఇండియా-చైనా సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) సమావేశాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ నెల మొదట్లో రెండు దేశాల మధ్య వర్చువల్ సమావేశం జరిగింది. అతి త్వరలోనే మరో రౌండ్ మిలిటరీ చర్చలు జరగనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
చర్చలు కొనసాగుతాయ్
చైనా, ఇండియా మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు జరుగుతున్న మాట నిజమే. మిలిటరీ, దౌత్య స్థాయిలలో ఈ చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకూ అవి ఫలించలేదు అని రాజ్‌నాథ్ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే బలగాలను తగ్గించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. చైనా వైపు కూడా బలగాలు తగ్గే అవకాశాలు లేవని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అయితే చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. చర్చల్లో ఏ అంశాలపై చర్చించాలో నిర్ణయించేందుకు రెండు దేశాల మధ్య హాట్‌లైన్ సందేశాలు కొనసాగుతున్నాయని చెప్పారు.