కర్నూలు, డిసెంబర్ 31,
ర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా బ్రహ్మానందరెడ్డిది బుడగ రాజకీయం అన్న చర్చలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఆయన రాజకీయాల్లో ఒక్కసారిగా టపాసులా వెలిగి వెంటనే మాయం అయిన పరిస్థితే కనిపిస్తోంది. ఆయన భవిష్యత్తులో రాజకీయంగా ఓ వెలుగు వెలగాలను కుంటున్నారా ? నిజంగానే ఆయనలో ఉత్సాహం లేదా ? లేక పార్టీలో ఆయనను ఎవరైనా ఉద్దేశ పూర్వంగా తొక్కేస్తున్నారా ? అనే చర్చ జరుగుతోంది. 2017లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో అనూహ్యంగా తెరమీదికి వచ్చారు బ్రహ్మానందరెడ్డి. నాడు దేశవ్యాప్తంగానే ఈ ఉప ఎన్నిక వార్తల్లో నిలిచింది. ఆ ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి తరఫున టీడీపీ నాయకులు అందరూ ఏక తాటిపైకి వచ్చి ప్రచారం చేశారు. అటు నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అయితే ఏకంగా రెండు వారాల పాటు నంద్యాలలోనే మకాం వేసి మరీ ప్రచారం చేశారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి అఖిల ప్రియ కూడా తన సోదరుడి గెలుపు కోసం.. తీవ్రంగాశ్రమించారు.ఇక, టీడీపీ నాయకులు, మంత్రులు కూడా నంద్యాల గెలుపు ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈక్రమంలో ఆ ఉప ఎన్నికలో .. బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత మాత్రం ఆయన రాజకీయంగా అడుగులు వేయడంలో తడబడ్డారని అంటున్నారు పరిశీలకులు. తన వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకోవడంలో ఆయన వెనుకబడ్డారని.. ఎమ్మెల్యేగా ఉంటూనే సబ్జెక్టు పెంచుకోవడంపై ఆయన దృష్టి పెట్టలేక పోయారని చెబుతున్నారు. ప్రతి విషయాన్నీ మాజీ మంత్రి అయిన సోదరి అఖిలప్రియకే వదిలేయడం.. ఆమె అనుమతి తీసుకున్న తర్వాతే.. ఆయన ముందుకు సాగడం వంటివి జరిగాయి. అధికారుల ట్రాన్స్‌ఫర్ నుంచి కార్యకర్తలను ఆదుకునే విషయం వరకు అన్నింటా ఆయన పూర్తిగా అఖిలమీదే ఆధారపడ్డారు.దీంతో నంద్యాల లాంటి కీలక నియోజకవర్గంలో బ్రహ్మానందరెడ్డి ముద్ర చివరకు సొంత పార్టీలో కూడా లేకుండా పోయింది. ఫలితంగా తనకంటూ.. ఇమేజ్‌ను పెంచుకోలేక పోయారు. ఇదే ఆయనకు శాపంగా మారింది. గత ఏడాది ఎన్నికల్లో ఈ విషయాలను అధ్యయనం చేసిన చంద్రబాబు టికెట్ ఇచ్చేందుకు కూడా నిరాకరించారు. అయితే.. తాను రెబల్‌గా మారతానని ప్రకటించడంతో బాబు చివరి నిముషంలో టికెట్ ఇచ్చారు. అయితే.. భూమా కుటుంబం నుంచి ఈ సారి.. ఆయనకు మద్దతు కనిపించలేదు. దీంతో ఆయన ఓడిపోయారు.ఇక, అప్పటి నుంచి కూడా బ్రహ్మానంద రెడ్డి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల పార్టీ కమిటీల్లోనూ బ్రహ్మానందరెడ్డికి ఎక్కడా చోటు కల్పించలేదు. అయితే, అఖిల ప్రియకు మాత్రం పార్టీ పదవుల్లో ఒకటి లభించింది. మొత్తంగా చూస్తే.. బ్రహ్మానందరెడ్డి దూకుడు లేకపోవడంతోనే మైనస్ అయిపోయారని అంటున్నారు పరిశీలకులు. అదే సమయంలో తమ సొంత సోదరుడు జగద్‌విఖ్యాత్‌రెడ్డి ని వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీ చేయించేందుకు ప్లాన్ చేసుకోవడంతో అఖిల ప్రియ కుటుంబం కూడా బ్రహ్మానందరెడ్డిని పక్కన పెట్టారనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.దీంతో బ్రహ్మానందరెడ్డి కేవలం రెండేళ్ల ఎమ్మెల్యేగా మిగిలిపోయేలా ఉన్నారు. మరోవైపు ఆయనకు స్వయానా మామగా ఉన్న కాటసాని రామిరెడ్డి బనగానపల్లె వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బ్రహ్మానందరెడ్డి అటు వైపు కూడా తొంగిచూసే అవకాశాలు ఉన్నాయని అఖిల వర్గమే ప్రచారం చేస్తోంది. దీంతో ఇటు సొంత పార్టీ వాళ్లకు కూడా ఆయన చేరువకాని పరిస్థితి. మొత్తానికి అఖిలప్రియ స్కెచ్‌లో బ్రహ్మానందరెడ్డి మౌనమునిలా చూడడమే తప్ప చేసేదేం లేకుండా పోయింది.