YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సాగర్ పై కమలం గురి

సాగర్ పై కమలం గురి

నల్గొండ, డిసెంబర్ 31, 
దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడంతో బీజేపీ మంచి ఊపు మీద ఉంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు అన్ని విధాలుగా చర్యలు ప్రారంభించింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉంది. ఆ ప్రాంతంలో బీజేపీకి బలం తక్కువ కావడంతో ముందు నుంచే విజయం కోసం కసరత్తును ప్రారంభించింది.ఇందుకోసం బీజేపీ ప్రత్యేకంగా రెండు సార్లు సర్వే నిర్వహించింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎవరన్న దానిపై సర్వే నిర్వహించింది. దీంతో పాటు ఏ ఏ ప్రాంతాల్లో తాము బలంగా ఉన్నదీ, బలహీనంగా ఉన్నదీ కూడా సర్వే నిర్వహించారు. ఈ సర్వే బాధ్యతలను బీజేపీలో కీలక నేతకు అప్పగించారని తెలిసింది. దుబ్బాక ఉప ఎన్నికకు ముందు కూడా ఆయనే సర్వే బాధ్యతలను తీసుకున్నారు.సర్వే లో వచ్చిన ఫలితాలను బట్టి బీజేపీ ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అభ్యర్థిని ముందుగానే ప్రకటించి ప్రచారంలో ముందు ఉండాలని బీజేపీ నిర్ణయించింది. సాగర్ ఉప ఎన్నిక మీద ఇప్పటికే కేంద్ర నాయకత్వం ఆరా తీసినట్లు తెలిసింది. ఉప ఎన్నికకు అవసరమైన నిధులను కూడా ఇచ్చేందుకు కేంద్ర నాయకత్వం అంగీకరించింది. దీంతో పాటు ఈ ఎన్నిక కోసం కేంద్ర నాయకత్వం ఇన్ ఛార్జిని నియమించనున్నట్లు తెలిసింది.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇన్ ఛార్జిగా వ్యవహరించిన భూపేంద్ర సింగ్ యాదవ్ నే నియమించనున్నట్లు తెలిసింది. గ్రేటర్ ఎన్నికల్లో ఆయన వ్యూహాలు సక్సెస్ కావడంతో సాగర్ ఎన్నికకు కూడా ఆయననే ఇన్ ఛార్జిగా కొనసాగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే అభ్యర్థిని కూడా ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. మొత్తం మీద నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో విజయం సాధించాలని అన్ని దారులనూ అన్వేషిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts