తిరుమల, డిసెంబరు 31
శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామివారి 71వ తిరునక్షత్రం సందర్భంగా గురువారం పెద్దమర్యాద జరిగింది. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి ముందుగా తిరుమలలోని పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, అధికారులు ఇస్తికఫాల్ స్వాగతం పలికి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి దర్శనం చేయించారు. అక్కడ శఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లి దర్శనం చేయించారు.
తిరుమలలో శ్రీ పెరియకోయిల్ కేల్వి అప్పన్ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్‌స్వామి సేవలందిస్తున్నారు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భగవద్ రామానుజాచార్యుల కాలంలో తిరుమలలో పెద్దజీయర్ మఠం ఏర్పాటైంది. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన కైంకర్యాలు, క్రతువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శ్రీ రామానుజాచార్యుల పరంపరలో వస్తున్న జీయర్‌స్వాములు తిరుమల శ్రీవారి ఆలయ కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.