బ్రహ్మదేవుడు 'నారాయణ' శబ్దం లోని రెండవ అక్షరమైన 'రా'ను నమశ్శివాయ శబ్దములోని రెండవ అక్షరమైన 'మ ' ను తీసుకొని రామ అను శబ్దమును సృష్టించి, సరస్వతీదేవికి చెప్పాడు. ఈ రామనామము మహా మహిమాన్వితమైనదనీ, రామనామం ఉఛ్ఛరిస్తే ఎంతో ఫలితం కలుగుతుందనీ, ముక్తిదాయకమని చెప్పాడు. ప్రక్కనే కుమారుడైన నారదుడు ఉన్నాడు. జాగ్రత్తగా విన్నాడు. ఇకనేం! బ్రహ్మ లోకం నుండి భూలోకం వచ్చాడు. ఒక అడవి మార్గం గుండా ప్రయాణిస్తున్నాడు. ఒక బోయవాడు తటస్థపడ్డాడు. అతని చరిత్రంతా దివ్య దృష్టితో క్షణంలో గ్రహించాడు. అతడు హింసాయుత కర్మాచరణలో ఉన్నాడు. అపమార్గంలో నడుస్తున్నాడు. అతడిని ఈ మార్గంనుంచి తప్పించి ఉన్నత మార్గానికి చేర్చాలి అనుకొన్నాడు. "రామ" అను శబ్దమును ఉపదేశించాడు. పట్టుదలతో జపించమన్నాడు. బోయవాడు శ్రద్దతో విన్నాడు. అదేపనిగా మనసులో స్మరిచుకుంటూ, కొంతసేపు, మరికొంతసేపు ఉచ్చరిస్తూ అడవిలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. రోజులు గడుస్తున్నాయి. తనపట్టుదలను వదలలేదు. ధృఢచిత్తంతో అలానే ఉన్నాడు. చుట్టూ పుట్ట వెలసింది. చిక్కిశల్యమయ్యాడు. పుట్టాకోనలనుండి, దివ్యకాంతులు ప్రసరిల్లుతున్నాయి. రామనామము విపడుచున్నది. సంవత్సరాలు గడిచాయి. పుట్టకొనలనుండి వస్తున్న "రామ" నామము బ్రహ్మలోకము చేరుకొన్నది. బ్రహ్మ సంతోషించాడు. ప్రత్యక్షమయ్యాడు. పుట్టపై తన క్రుపారస ద్రుష్టిని ప్రసరింపచేశాడు. పుట్టలోనుండి బంగారు వన్నెచాయతో గల మేనితో, తెల్లని గడ్డముతో, జడలతో ఒక చేతిలో కమండలము, మరొక చేతిలో దండముతో, ఙ్ఞానజ్యోతి రూపు దాల్చాడా అన్నాట్లు ఒక మహర్షి లేచి వచ్చి బ్రహ్మదేవునకు నమస్కరించాడు."నీవు వల్మీకము (పుట్ట)నుంచి లేచివచ్చావు కనుక ఇకనుండి "వాల్మీకి" అను పేరుతో పిలువబడతావు. నీవలన ఒక మహత్కార్యము నెరవేరుతుంది. అది రామాయణ కావ్య రచన. ఈ కావ్య రచనవలన లోకములో రామనామము వ్యాప్తి చెందుతుంది. సర్వమానవాళికి రామనామము సధ్గతిని కలిగిస్తుంది. కనుక రామాయణము రచింపుమని ఆదేశించాడు. వాల్మీకి మహర్షి రామాయణమును రచించాడు. అందులో గాయత్రీ మంత్రమును నిషిప్తంచేశాడు. ఈ కావ్యంలో ఎదొక చెప్పుకోదగిన విశేషము- ఇంకా అనేకం వున్నాయి.విష్ణు సహస్ర నామాలు పఠిస్తే దుస్వప్నములు రావు. అశుభములు కలుగవు. ధర్మార్ధ కామ మోక్షాలు కలుగుతాయి. అనారోగ్యములు కలుగవు. బంధనముల నుండి విముక్తులవుతారు. ఆపదలు సంభవించవు. ఇలా ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇన్ని ప్రయోజనాలు సులభంగా పొందడానికి ఏదేని ఉపాయం ఉన్నదా? అని పార్వతీ దేవి శివుడిని అడిగినది.- శివుడు సులభంగా పొందడానికి ఉపాయం ఉన్నది, అది-
శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.
రామ అనే శబ్ధం ఒకసారి పటిస్తే విష్ణుసహస్రనామాలు ఒకసారి పఠించిన దానితో సమానము- కనుక రామనామము అంత విశిష్టమైనది, అన్నినామములలోకెల్లా శ్రేష్ఠమైనదనీ అన్నాడు.
మనభారతీయులు వ్రాయడానికి ముందుగా 'రామ' వ్రాసి ప్రారంభిస్తారు. కొందరు భక్తులు రామనామం ఉచ్చరిస్తూ రామకోటి వ్రాస్తారు. అటువంటివారికి సర్వశుభములు కలుగును. వారికి శ్రీరామరక్ష.
ఓం నమో నారాయణాయ