గుంటూరు, జనవరి 1,
గుంటూరు జిల్లా పల్నాడు అంటేనే పౌరుషాల గడ్డ. ఇక్కడ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ప్రస్తుత ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డిలు `సై.. అంటే సై` అంటూ.. సవాళ్లు రువ్వుకుంటున్నారు. `నువ్వెంతంటే.. నువ్వెంతంటూ`.. ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. దీంతో గురజాలలో పల్నాడు పుంజుల రాజకీయ రణం ఆసక్తిగా మారింది. విషయంలోకి వెళ్తే టీడీపీ తరఫున 1990ల నుంచి యరపతినేని శ్రీనివాసరావు ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. 1994 ఎన్నికల్లో ఆయన ఇక్కడ టీడీపీ జెండా పాతారు. తనను తాను నిలదొక్కుకుంటూ 2009, 2014లో వరుస విజయాలు దక్కించుకున్నారు. నిజానికి 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హవా రాష్ట్ర వ్యాప్తంగా సాగినా గురజాలలో మాత్రం యరపతినేని విజయం సాధించి రికార్డు సృష్టించారు.గత ఏడాది ఎన్నికల్లో సీనియర్ రాజకీయ కుటుంబం నుంచి తెరమీదకి వచ్చిన కాసు మహేశ్‌రెడ్డి ఇక్కడ తొలిసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా పాతారు. వాస్తవానికి ఈయన స్థానికేతరుడు. అయితే.. జగన్ సునామీ ఆయనకు కలిసి వచ్చి గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఇద్దరు నేతల మధ్య రాజకీయ వివాదాలు కాక రేపుతున్నాయి. కాసు మహేశ్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఏడాదిన్న అయింది. దీంతో సహజంగానే నియోజకవర్గం అభివృద్ధిపై చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే అటు పదేళ్లపాటు వరుసగా ఇక్కడ ఎమ్మెల్యే అయిన యరపతినేని శ్రీనివాసరావుకి, ప్రస్తుతం ఏడాదిన్నర పూర్తి చేసుకున్న కాసు మహేశ్‌రెడ్డికి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
“ఏడాదిన్నర అయింది.. నువ్వు ఏం అభివృద్ధి చేశావో చెప్పు?“ అంటూ.. యరపతినేని శ్రీనివాసరావు ప్రశ్న సంధిస్తే.. “మీరు పదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నారు.. మీరు చేసిందేంటో చెప్పండి“ అంటూ కాసు ఎదురు ప్రశ్నలు సంధిస్తున్నారు. అంతేకాదు.. సహజ ధోరణికి భిన్నంగా ఇద్దరు నేతలు.. టీవీ డిబేట్లలో పాల్గొనడం మరింతగా రాజకీయాలను వేడెక్కిస్తోంది. “ఈ ఏడాదిన్నరలో మా పార్టీ సానుభూతిపరులపై దాడులు చేసి.. ముగ్గురిని హత్య చేశారు. ఇంతకన్నా.. మీ హత్యా రాజకీయాలకు పరాకాష్ట ఇంకేముంటుంది?“ అని యరపతినేని అంటే.. “మీవాళ్లు.. మా వాళ్లపై దాడులు చేశారు. సో.. మీవే హత్యారాజకీయాలు“ అంటూ కాసు ప్రతి విమర్శ చేశారు. “పల్నాడుకు ఏమైనా చేయాలంటే.. నేనే చేయాలి. నిరంతరం నా వైపే ప్రజలు ఉన్నారు“ అని యరపతినేని ప్రకటిస్తే.. “అందుకే మిమ్మల్ని చిత్తుగా ఓడించి.. మాకు అవకాశం ఇచ్చారు“ అని ప్రతి విమర్శతో కాసు దాడి చేశారు.కీలకమైన అభివృద్ది విషయంలో తాను మాత్రమే గురజాలను అభివృద్ధి చేశానని యరపతినేని శ్రీనివాసరావు చెప్పుకొంటే.. తాము కూడా అనేక ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని.. కాసు చెప్పుకొచ్చారు. ఇక, అవినీతి-అక్రమాల విషయంలో కాసు సీనియర్లను మించిపాయారంటూ.. యరపతినేని వ్యంగ్యాస్త్రాలు సంధించగా.. అందుకే మీపై సీబీఐ కేసులు ఉన్నాయంటూ.. కాసు ప్రతి దాడి చేశారు. ఇలా మొత్తంగా ఇద్దరు నేతల మధ్య కూడా భారీ ఎత్తున మాటల తూటాలు.. సవాళ్ల ప్రతిసవాళ్లు ఓ రేంజ్‌లో సాగాయి. అయితే, స్థానిక ప్రజలు మాత్రం సవాళ్లు-ప్రతి సవాళ్లు, విమర్శలు-ప్రతి విమర్శలను కోరుకోకపోవడం గమనార్హం. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు ప్రజానాడిని పట్టుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి యరపతినేని శ్రీనివాసరావు, కాసు మహేశ్‌లు ఏం చేస్తారో చూడాలి..!