విజయవాడ, జనవరి 2,
వైసీపీలోనూ వారసత్వ రాజకీయాలు ఊపందుకున్నాయి. వచ్చే ఎన్నికలకు తమ వారసులను రంగంలోకి దించేందుకు సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. జగన్ యువకుడు కావడంతో ఆయన పార్టీలో సీనియర్లుగా ఇమడ లేక కొందరు, తమ వారసులకు రాజకీయ భవిష్యత్ ను అందించేందుకు మరికొందరు వారసులను రాజకీయాల్లోకి దించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో సీనియర్ నేేతలు ఉండటం విశేషం. వీరికి జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు.పాణ్యం నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరుసార్లు విజయం సాధించారు. తనను పాణ్యం నియోజకవర్గం నుంచి దూరం చేసే శక్తి ఎవరికీ లేదని కాటసాని రాంభూపాల్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తన కుమారుడు కాటసాని శివ నరసింహారెడ్డిని బరిలోకి దించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ మేరకు వైసీపీ హైకమాండ్ నుంచి కూడా అనుమతి లభించిందని చెబుతున్నారు.మరో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సయితం తన వారసుడిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. బొత్స సందీప్ ను ఆయన రాజకీయంగా పైకి తెచ్చేందుకు పావులు కదుపుతున్నారు. వైసీపీలో ముఖ్యనేతగా సందీప్ ను మలచాలన్నది బొత్స సత్యనారాయణ వ్యూహంగా ఉంది. త్వరలోనే డాక్టర్ సందీప్ రాజకీయ అరంగేట్రం ఖాయమని చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ సయితం బొత్స ప్రతిపాదనకు అంగీకరించినట్లు తెలిసింది.మరో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు కుమారుడు మనోహర్ నాయుడు కూడా ఇప్పటికే రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయనను కూడా వచ్చే ఎన్నికలలో వైసీపీ తరుపున బరిలోకి దించాలని ధర్మాన ప్రసాదరావు ప్రయత్నిస్తున్నారు. ఇక ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సయితం తన వారసుడు నాగ్ ను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే నాగ్ ను వైసీపీ అధినేత జగన్ కు పరిచయం చేశారు. ఇలా వారసులను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించేందుకు సీనియర్ నేతలు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేతలు వారసులను బరిలోకి దింపినా ఫలితం కన్పించలేదు. మరి వైసీపీ నేతల వారసులు వచ్చే ఎన్నికల్లో విజయం అందుకుంటారా? లేదా? చూడాల్సి ఉంది.