YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రజనీ కాంత్ కోసం నేతల క్యూ..

రజనీ కాంత్ కోసం నేతల క్యూ..

చెన్నై, జనవరి 2, 
ఇక నా జీవితం ప్రజలకే అంకితం.. సరిగ్గా ఈ మాటలని రెండు నెలలు కాలేదు. అప్పుడే తలైవా రజనీకాంత్ అనారోగ్యం కారణంగా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టలేనని చెప్పడం దేశవ్యాప్తంగా షాక్ కలిగించింది. కుటుంబం ఒత్తిళ్లో, షూటింగ్‌లో 50 మంది సమక్షంలోనే కరోనా కొందరికి సోకిన నేపథ్యం కలిగించిన మనస్తాపం వల్లో కానీ రజనీ రాజకీయాలు వద్దనుకున్నారు. రాజకీయ పార్టీలు తన నిర్ణయంపై వ్యతిరేకంగా స్పందించలేదు. పైగా ఆయన మద్దతు మాకుంటే చాలు అంటూ తమిళనాడులో కమల్ హసన్ నుంచి కమలం పార్టీ దాకా కోరుకుంటున్నాయి. రజనీనీ కలవడానికి పోటీలు పడుతున్నాయి.తమిళనాడు లోని పలు పార్టీలు ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌ వెంటపడుతున్నాయి. ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు పోటీపడుతున్నాయి.రాజకీయాలు వద్దన్నావు సరే...  ఎన్నికలకు వెళ్లనన్నావు సరే... మీరు వద్దనుకున్నా మీలోని చరిష్మా మాకివ్వు.. మా పార్టీ గెలుపునకు మద్దతుగా నిలువు. కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపు.. అంటూ  ఇప్పుడు పెద్దా చిన్నా రాజకీయ పార్టీలన్నీ రజనీ నామస్మరణ చేస్తున్నాయి.రజనీ నిర్ణయం ఒకటి, రెండు పార్టీలకు మినహా అనేకపార్టీలకు ఆనందం కలిగించింది. రాష్ట్రంలో రజనీ ఫాలోయింగ్‌ను ఓటింగ్‌గా మలుచుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రజనీ కరుణాకటాక్ష వీక్షణాల కోసం పలు పార్టీలు ఆయన ఇంటిముందు క్యూకట్టేలా ఉన్నాయి. ఇందులో అందరికంటే ముందు నిలిచింది మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షులు, నటుడు కమల్‌హాసన్‌. రాజకీయ పార్టీ పెట్టడం లేదని రజనీ ప్రకటించగానే మిత్రుని మద్దతు కోరుతానని కమల్‌ మొట్టమొదటగా ప్రకటించారు. అయితే ఆధ్యాత్మికతతో కూడిన రజనీ రాబోయే ఎన్నికల్లో తమకు అండగా నిలుస్తారని అన్నాడీఎంకే సైతం తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీకి రజనీకాంత్‌ మిత్రుడు. ఈ మిత్రత్వాన్ని అవకాశంగా తీసుకుని మద్దతు కోరేందుకు కమలనాథులు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ ఇప్పటికే ఆ ప్రయత్నాలను ప్రారంభించినట్లు సమాచారం. ఇక 1996 ఎన్నికల్లో డీఎంకేకు మద్దతు ఇవ్వడం ద్వారా డీఎంకే విజయానికి రజనీకాంత్‌ దోహదపడ్డారు. అప్పటి నుంచి డీఎంకే అధ్యక్షులు స్టాలిన్, రజనీ మధ్య మైత్రిబంధం ఏర్పడింది. అయితే ఈ ఎన్నికల్లో సైతండీఎంకే తన వంతు ప్రయత్నాలు చేయడం అనుమానమే. ఆనాడు జయపై వ్యతిరేకతతోనే రజనీ అలా వ్యవహరించారేగానీ డీఎంకే గెలుపుపై ఆసక్తితో కాదు. కాగా రజనీతో కలిసి పనిచేసేందుకు ఆశపడుతున్నానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరం ఇటీవలే ట్వీట్‌ చేసి పరోక్షంగా మద్దతు కోరారు. రజనీ కోసం ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు. మరి రజనీ ఎవరివైపైనా మొగ్గుచూపుతారా లేక మౌనంగా ఉండిపోతారా అనే ప్రశ్నకు సమాధానం కోసం ఎన్నికల వరకు వేచిచూడక తప్పదు. 

Related Posts