ఆధునిక భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో జులై నెలకు ఒక విశిష్టత ఉంది. మహాత్ముల జననానికి ఎంత ప్రాముఖ్యం ఉందో, వారి మరణానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఒక విశేష కార్యం కోసం వీరిని సృష్టికర్త ఈ లోకానికి పంపితే, తమ పని పూర్తయిన వెంటనే తిరిగి తండ్రి చెంతకు చేరుకుంటారు. వీరు జనన, మరణాలకు అతీతులు. రామకృష్ణ పరమహంస మానసపుత్రుడిగా, హైందవ విజయరథానికి అధునాతన సారథిగా విశ్వజైత్రయాత్రను కొనసాగించి, భావి విజయపథ నిర్దేశకుడైన స్వామి వివేకానంద 1902 జులై 4న తనువు చాలించారు. వైద్యుడిగా జీవితాన్ని ప్రారంభించి, యోగిగా పరివర్తన చెంది, లైఫ్ సొసైటీని స్థాపించి, దివ్య జీవన పరిమళాలను నలుదిశలా వ్యాపింపజేసి స్వామి శివానంద 1963 జులై 14 నే ఈ లోకాన్ని విడిచారు.
తెలుగునాట పవిత్ర ఆధ్యాత్మిక కుటుంబంలో పుట్టి, చిన్న వయసులోనే సమస్త శాస్త్రాలను ఔపోసాన పట్టి, కావ్యకంఠ అనే బిరుదు పొందిన రమణ మహర్షికి ప్రియ శిష్యుడు గణపతి ముని 1936 జులై 25 న పరమపదించారు. అసంఖ్యాక సంస్కృత కావ్యాలు రాసిన ఈ మహాకవి, మంత్రద్రష్ట, దేశభక్తుడిగా ఖ్యాతి గడించారు. ఈ ముగ్గురు మహాత్ములు జులైలో దేహత్యాగం చేయడం ఒక విశేషమైతే, ఇదే నెలలో మరో గొప్ప వ్యక్తి కూడా ఆత్మసాక్షాత్కారం జరిగింది. అతడే స్వస్వరూప దర్శనం పొంది, రమణమహర్షిగా పరిణామం చెందిన బాలుడు వెంకట్రామన్. తమిళనాడులోని మదురైలో మీనాక్షి ఆలయం దక్షిణ గోపురానికి ఎదురుగా ఉన్న వీధిలో వెంకట్రామన్ (రమణ మహర్షి) తన చిన్నాన్న ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. 1896 జులై నాటి సంఘటన వారి మాటల్లోనే....
‘మధురైను నేను శాశ్వతంగా వీడటానికి ఆరువారాల ముందు నా జీవితంలో ఓ సంఘటన ఆకస్మాత్తుగా సంభవించింది. మేడ మీద గదిలో ఒంటరిగా ఉన్న నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నాకు ఎలాంటి అనారోగ్యం లేకపోయినా ఉన్నట్టుండి మృత్యుభయం కలిగింది. ఇంక నాకు మరణం తప్పదనిపించింది. ఎందుకలా అనిపించిందో తెలియదు. వైద్యులను, బంధుమిత్రులను పిలవాలని కూడా అనుకోలేదు. ఈ సమస్యను స్వయంగా నేనే పరిష్కరించుకోవాలనుకున్నాను. సరే! చావు వచ్చింది... ఈ శరీరం చనిపోతుంది. ఈ దృశ్యాన్ని నాటకంలో మాదిరిగా నాకు నేనే అనుభవ సిద్ధం చేసుకున్నాను. కాళ్లు చేతులు చాచి, బిగబట్టి శవంలాగా పడుకున్నాను. గట్టిగా నోరు మూసుకుని పెదాలు బిగించాను. నేను అన్న శబ్దం తప్ప వేరే తలంపు రాకూడదనుకుని మనసులో అనుకున్నాను.
ఈ శరీరం ఇప్పుడు చనిపోయింది. కట్టెను శ్మశానికి తీసుకెళ్లి దహనం చేస్తే బూడిదవుతుంది. శరీరం చనిపోతే నేను చనిపోయినట్లేనా? ‘నేను’ ఈ శరీరమా? అయితే ఇది నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉంది. కానీ జీవశక్తి ఉన్నట్లు నాకు స్పష్టంగా తెలుస్తోంది. ‘నేను’ అనే శబ్దం కూడా లోపల వినిపిస్తుంది. కాబట్టి ‘నేను’ అనేది దేహానికి అతీతమైన శక్తి. భౌతిక దేహం చనిపోతుంది కానీ ఆ చైతన్య శక్తిని మృత్యువు తాకలేదు. కాబట్టి చావులేని చైతన్యాన్ని ‘నేను’. ఇదంతా తార్కికంగా కలిగిన అవగాహన కాదు. తర్కం లేని సజీవ సత్యం. మెరుపులా నాలో మెరిసింది. ఆ స్థితిలో ‘నేను’ అన్నదొక్కటే వాస్తవం. చేతనమైన శరీర వ్యాపకాలన్నీ ‘నేను’ మీదే ఆధారపడి ఉన్నాయి. అప్పటి నుంచి ‘నేను’ లేదా ‘ఆత్మ’పై నా దృష్టిని కేంద్రీకరించాను. మృత్య భయం ఒక్కక్షణంలో శాశ్వతంగా మాయమైపోయింది. ఆ రోజు నుంచే ఆత్మలో లీనమైపోయాను. ఇతర భావాలు సప్తస్వరాల్లా వచ్చిపోతాయి. ఈ ‘నేను’ అనేది నేపథ్యంలో శృతిలా ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది’.
ఇదీ రమణ మహర్షి ఆత్మ సాక్షాత్కార ఘట్టం. ఈ రమణీయ సన్నివేశం తలచుకుంటే మార్కండేయ మహర్షి గుర్తుకు వస్తాడు. యముడు తన పాశంతో తరుముకొస్తుంటే ఈ పదహారేళ్ల బాలుడు ఈశ్వరుణ్ణి శరణు వేడుతూ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. దీంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై యమధర్మరాజుని వెళ్లిపొమ్మని ఆదేశించి, మార్కండేయుడికి పూర్ణాయుష్షును ప్రసాదించాడు. అతడిని మృత్యుంజయునిగా చేసిన ఆ అమృత ఘట్టం ఈ యుగంలో పునరావృతమైనట్టు అనిపిస్తుంది కదూ!