న్యూఢిల్లీ జనవరి 2,
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ముందస్తు సన్నాహకంగా కేంద్ర ప్రభుత్వం శనివారంనాడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 'డ్రై రన్' నిర్వహించింది. 'డ్రై రన్' సన్నద్ధతపై ఢిల్లీ ప్రభుత్వాధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ శుక్రవారం సమీక్షా సమావేశం జరిపిన విషయం తెలిసిందే. వాక్సిన్ రిహార్సల్స్గా చెబుతున్న 'డ్రై రన్'ను అసోం, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్లలో గత డిసెంబర్ 28, 29 తేదీల్లో నిర్వహించారు. తక్కిన రాష్ట్రాల్లో శనివారం ఈ డ్రై రన్ నిర్వహించారు. హెల్త్ వర్కర్ల జాబితాను సిద్ధం చేసి కోవిడ్ ఫ్లాట్ఫాంపై అప్లోడ్ చేస్తామని, ఎన్నికల సమయంలో ఏ విధంగా సన్నాహాలు చేస్తామో, అదే పద్ధతిలో అన్ని వైద్య బృందాలకు బాధ్యతాయుతంగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని హర్షవర్దన్ చెప్పారు. జాతీయ స్థాయిల్లో 2,000 మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో 700కు పైగా జిల్లాల్లో శిక్షణ ఉంటుందని చెప్పారు. ఎన్నికల సమయంలో బూత్ స్థాయిలో శిక్షణ ఏవిధంగా ఉంటుందో అదో విధంగా ఈ శిక్షణ కూడా ఉంటుందన్నారు.