శ్రీరాముడు దేవుడు. లోకాభిరాముడు. ఆదర్శ పురుషుడు. అటువంటి రాముడు ఏం చేశాడు అంటే దుష్ట సంహారం చేసి రావణుడిని నిర్జించాడు అని పురాణాలు చెబుతాయి. అధునిక కాలంలో రాముడు చాలానే చేశాడు. రెండు సీట్లు ఉన్న బీజేపీకి ఏకంగా 303 సీట్లు ఇచ్చేశాడు. ఇప్పటికి నాలుగు సార్లు అధికారంలోకి వచ్చేలా దీవించాడు. ఇంకా కరుణ ఉంటే మరిన్ని సార్లు కూడా ఛాన్స్ ఇస్తాడేమో. అటువంటి రాముడికీ రాజకీయాలకూ చాలా పెద్ద అనుబంధమే ఉంది. అందుకే మరి తామూ వీర భక్త హనుమంతులమేని ఏపీలోని విపక్షాలు ఇపుడు రాముణ్ణి శరణు కోరుతున్నాయి.హిందుత్వా అజెండా అంటే అది కచ్చితంగా బీజేపీదే. దాని మీద పేటెంట్ హక్కులన్నీ కూడా ఆ పార్టీకి ఉన్నాయి. ఒక నాడు మత రాజకీయాలను సహించేది లేదు అని గర్జించిన చంద్రబాబే ఇపుడు జెండా మార్చేశారు. జై హిందూత్వ అంటున్నారు. నామాలు ఎక్కువ పెట్టి మరీ బీజేపీని మించిపోవాలని చూస్తున్నారు. నిజానికి రామతీర్ధాలు విగ్రహ విద్వంస ఘటన విషయంలో బీజేపీ ఒక మాదిరిగానే స్పందించింది. కానీ టీడీపీ ఆ పార్టీకి షాక్ ఇచ్చేలా పావులు కదిపింది. ఏకంగా చంద్రబాబు హైదరాబాద్ ని వీడి రామతీర్ధానికు వచ్చి మరీ చేసిన రచ్చతో తొలి షాక్ కాషాయం పార్టీకే తగిలింది.ఉమ్మడి ఏపీ విభజన తరువాత విజయనగరం జిల్లాలోని రామతీర్ధాలుకు మహర్దశ వచ్చిందని అంతా సంతోషించారు. ఎందుకంటే ఉత్తరాంధ్రా భద్రాద్రిగా ఈ ఆలయం పేరు పొందింది. అంతా కలసి అధికారికంగా శ్రీరామనవమి వేడుకలను రామతీర్ధాలులో జరపమని నాటి సీఎం చంద్రబాబుని కోరారు. కానీ చంద్రబాబు ససేమిరా అనడమే కాదు, కడప జిల్లా ఒంటిమెట్ట కోందండ రామాలయాన్ని ఎంపిక చేశారు. దాంతో ఈ ప్రాంతీయులు ఆస్తిక జనులు చాలా బాధపడ్డారు. కనీసం ఆలయాన్ని అభివృద్ధి చేయమన్నా కూడా అసలు పట్టించుకోలేదు. చంద్రబాబు ఎన్నో సార్లు విజయనగరం జిల్లాకు వచ్చారు కానీ ఏనాడు రామతీర్ధాలు ఎక్కడ ఉందని వాకబు చేయలేదని విమర్శలు ఉన్నాయి. ఇపుడు మాత్రం తగుదునమ్మా అంటూ ఆయన తన పరివారంతో రామతీర్ధాలుకు వేంచేసి రాజకీయ రచ్చకు దిగిపోయారని అంటున్నారు.ఎవరు చేశారో తెలియదు కానీ రాముల వారి శిరస్సుని ఖండించడం మాత్రం దారుణమైనది. అంతకంటే దారుణమైనది ఈ రాజకీయ రచ్చ అని ఆస్తిక జనులు అంటున్నారు. ఇలా రాముడి మీద ప్రేమ ఒలకబోస్తున్న రాజకీయ జీవులకు ప్రసాదం మీదనే భక్తి ఉందని కూడా సెటైర్లు పడుతున్నాయి. మరో మూడు నెలల్లో శ్రీరామ నవమి రాబోతోంది. ఇప్పటికైనా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి గట్టి నిఘాను పెట్టాలని, ఉత్తరాంధ్రా ప్రజలంతా తరలివచ్చేలా రవాణా సదుపాయాలను పెంచాలని అంతా వైసీపీ సర్కార్ ని కోరుతున్నారు. మొత్తానికి రాముడి ఆశీస్సులు ఎవరికి ఉంటాయన్నది ఇప్పటికైతే తెలియదు కానీ దేవుళ్ళను, దేవతలను వారి మానాన వదిలిపెడితే అంతకంటే భాగ్యం వేరు ఉండదని భక్త జనుల నుంచి వినిపిస్తున్న మాట.